బీఆర్ఎస్‌లోకి కీలక నేత.. బీజేపీకి ఊహించని షాక్!

by Disha Web Desk 4 |
బీఆర్ఎస్‌లోకి కీలక నేత.. బీజేపీకి ఊహించని షాక్!
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ భద్రాద్రి జిల్లా రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది. నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీల మార్పుపై ఫోకస్ చేస్తున్నారు. తమకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందో అని వెతుకులాడే వారు కొందరైతే అధిష్టానాలు ఇచ్చే స్పష్టమైన హామీలతో పార్టీ మార్పులకు సిద్ధపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు జరుపుతూ తమకున్న క్యాడర్‌ని తమతో పాటు తీసుకువెళ్లే దిశగా పావులు కదుపుతున్నారు.

భద్రాద్రి జిల్లా బీజేపీకి ఊహించని షాక్..

మరి కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. గత మూడు సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా కొనసాగిన కోనేరు సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తండ్రి కోనేరు నాగేశ్వరరావు టీడీపీ పార్టీలో ఉంటూ బలమైన క్యాడర్‌ని సంపాదించుకున్నారు. కోనేరు నాగేశ్వరరావు మరణం అనంతరం తన రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న కోనేరు సత్యనారాయణ బీజేపీ పార్టీలో జిల్లా అధ్యక్షులుగా కొనసాగారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్తు మరింత ముందుకు వెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తన వర్గీయులు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ కీలక పాత్ర..

కోనేరు సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరిక కోసం అధిష్టానికి దగ్గరగా ఉండే ఒక ఎమ్మెల్సీ, (జిల్లా నాయకుడు)ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. పార్టీలో చేరిక విషయంలో ఆరు నెలల సుదీర్ఘ మంతనాలు జరిపి చివరకు విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి భద్రాద్రి జిల్లాలో కమ్మ సామాజిక వర్గ నాయకులు లేకపోవడంతో అదే సామాజిక వర్గం నుండి కోనేరు సత్యనారాయణను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలం ఇంకాస్త పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కాంట్రవర్సీకి దూరంగా ఉన్న ఏకైక నాయకుడు కోనేరు సత్యనారాయణ అని చెప్పవచ్చు.

కేసీఆర్ స్పష్టమైన హామీ..

చేరిక అనంతరం కోనేరు సత్యనారాయణ భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రి అయిన కోనేరు నాగేశ్వరరావుకు కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తన భవిష్యత్తు రాజకీయాలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రానున్న ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కోనేరు సత్యనారాయణ చేరిక పార్టీ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకవైపు ముక్కి మూలుగుతున్న బీజేపీ పార్టీకి కోనేరు సత్యనారాయణ సెండ్ ఆఫ్ ఇవ్వడంతో జిల్లాలో బీజేపీ పార్టీ మనగడ ప్రశ్నార్థకంగానే మారనట్లయింది. కోనేరు చిన్ని 24, 25 తేదీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.


Next Story