నేడే భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. హెలికాప్టర్‌తో పూలవర్షం!

by Disha Web Desk 2 |
నేడే భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. హెలికాప్టర్‌తో పూలవర్షం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వ కృషిని కొనియాడారు. చరిత్రలో ఈ విగ్రహం, దాని వెనక సీఎం కేసీఆర్ కృషి ఎప్పటికి నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయగా ఏడేండ్ల తర్వాత అది కార్యరూపం దాల్చింది. ఈ విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్‌గా నిర్వహిస్తున్నది. అన్ని జిల్లాల నుంచి ప్రజలు, అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల కార్యకర్తలు హాజరవుతున్నిరు. విగ్రహావిష్కరణ కార్యక్రమం తర్వాత వీరిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నర్, విపక్ష నేతలకు ఆహ్వానంపై సచివాలయ అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. సుమారు రూ. 146 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఆరేళ్ళ పాటు కసరత్తు జరిగింది. ఎట్టకేలకు ప్రముఖ డిజైనర్ రాం వంజీ సుతార్ రూపొందించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదించింది. అంబేద్కర్ నిలువెత్తు రూపంలో రూపొందిన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లాల్లో వారోత్సవాల తరహాలో నిర్వహించేలా సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వివిధ కళారూపాల ద్వారా అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రజలకు అందించేలా తెలంగాణ సాంస్కృతిక సారధి నిర్వాహకులకు మంత్రి శ్రీనివాసగౌడ్ అదేశాలు జారీచేశారు.

హెలికాప్టర్‌తో పూలవర్షం

రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంగా రికార్డు సృష్టించిందని అధికారులు పేర్కొన్నారు. ముసాయిదా షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు విగ్రహావిష్కరణ జరగనున్నది. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించే ఏర్పాట్లతో పాటు విగ్రహానికి క్రేన్ ద్వారా గజమాలను వేసే కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరిగాయి. సుమారు 40 వేల మందికి పైగా ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. విగ్రహం పక్కనే జరిగే బహిరంగసభకు వివిధ జిల్లాల నుంచి జనం వస్తున్నందున వేసవి ఎండను దృష్టిలో పెట్టుకుని రక్షణ కోసం తగిన ఏర్పాట్లు జరిగాయి.

మొదలైంది ఇలా :

= సీఎం కేసీఆర్ 2016 ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు.

= ఎస్సీ అభివృద్ధి శాఖ తరఫున 11.4.2016న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన విగ్రహావిష్కరణ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో (నెం. 211) జారీ అయింది.

= ఎత్తయిన విగ్రహాలపై స్టడీ చేసేందుకు ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి అధ్యక్షతన టెక్నికల్ కమిటీని 2016 మే 21న ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది.

= విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా డిజైన్ అసోసియేట్స్ అనే సంస్థకు అప్పగిస్తూ 2018 ఏప్రిల్ 4న ఎస్సీ అభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణా బాధ్యతల కోసం మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థగా నియమించింది.

= ఇప్పుడు ఖరారు చేసిన డిజైన్‌తో పాటు మరొకటి కూడా ప్రభుత్వానికి అందించింది. పార్లమెంటు ఆకృతిని బేస్‌గా ఉండే నమూనాను సీఎం ఆమోదించారు.

= ఖరారు చేసిన డిజైన్‌ ప్రకారం నిర్మాణానికి రూ. 146.50 కోట్లు ఖర్చవుతుందంటూ విగ్రహ నమూనాను రూపొందించిన రాం వంజీ సుతార్ ఇచ్చిన అంచనాతో ప్రభుత్వానికి డిజైనర్ అసోసియేట్స్ సంస్థ రిపోర్టు అందజేసింది.

= విగ్రహానికి అవసరమైన రూ. 146.50 కోట్లను ఆమోదిస్తూ ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ 2020 సెప్టెంబరు 16న ఆమోదం తెలిపింది.

= రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. గతేడాది జూన్ 30న ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని 12 నెలల్లో పనులను పూర్తిచేసి ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేసింది.

= షెడ్యూలుకంటే రెండు నెలల ముందే విగ్రహం రెడీ అయ్యి అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరణకు నోచుకుంటున్నది.

విగ్రహానికి సంబంధించిన వివరాలు :

విగ్రహం ఎత్తు : 125 అడుగులు

పార్లమెంటు ఆకృతిలో బేస్ : 50 అడుగులు

దీని వ్యాసం : గ్రౌండ్ ఫ్లోర్‌లో 172 అడుగులు; టెర్రేస్‌లో 74 అడుగులు

లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం : 2,066 చ.అ

గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం : 15,200 చ.అ.

బేస్‌లో ఉండేవి : మ్యూజియం, లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, కాన్ఫరెన్సు హాలు

బేస్ టెర్రేస్ విస్తీర్ణం : 2,200 చ.అ

లిఫ్టులు : 2 (ఒక్కోదాంట్లో ఏకకాలంలో 15 మంది పట్టేలా)

మెయిన్ బిల్డింగ్, బ్లాకులు : 1.35 ఎకరాలు (6,792 చ.అ)

గ్రీనరీతో కూడిన పార్కు : 2.93 ఎకరాలు

సందర్శకులు నడిచే దారి : 1.37 ఎకరాలు

సుందరీకరణ కోసం : 1.23 ఎకరాలు

పార్కింగ్ (450 కార్లు) : 4.82 ఎకరాలు

మొత్తం అంబేద్కర్ మందిరం విస్తీర్ణం : 11.7 ఎకరాలు

మొత్తం బిల్టప్ ఏరియా : 26,528 చ.అడుగులు

విగ్రహానికి వినియోగించిన స్టీల్ : 360 టన్నులు

విగ్రహం పైపూతకు వాడిన కంచు : 114 టన్నులు

Read more:

అంబేడ్కర్ భవనాల జాడేది?



Next Story

Most Viewed