దర్శకుడు శంకర్​కు కేటాయించిన భూమిపై విచారణ

by Dishafeatures2 |
దర్శకుడు శంకర్​కు కేటాయించిన భూమిపై విచారణ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సినీ దర్శకుడు ఎన్.శంకర్​కు మోకిళ్లలో అయిదు ఎకరాల భూ కేటాయింపుపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రభుత్వం నామమాత్రపు ధరకే శంకర్​కు కట్టబెట్టిందంటూ కరీంనగర్​కు చెందిన జే.శంకర్​ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్​వేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరుగగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్​జనరల్​వాదనలు వినిపిస్తూ ఫిల్మ్ ​డెవలప్​మెంట్​కార్పోరేషన్ ​సిఫార్సు మేరకు రాయితీ ధరతో భూమిని కేటాయించే అధికారం కేబినెట్​కు ఉందని చెప్పారు. సినీ స్టూడియో నిర్మాణం కోసం మాత్రమే అయిదు ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ర్టంలో పలు సినీ స్టూడియోలకు ఇదే విధంగా భూములు ఇచ్చారన్నారు.

భూ కేటాయింపుల్లో ఎలాంటి పక్షపాతం, నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతానికి చెందినవారిని ప్రోత్సహించాలన్న విధానంలో భాగంగానే సినీ దర్శకుడు శంకర్​కు భూమి ఇచ్చినట్టు వివరించారు. కాగా, పిటీషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2007 తరువాత భూ కేటాయింపులకు సంబంధించి చట్టాలు మారినట్టు చెప్పారు. మారిన ఈ చట్టాల ప్రకారం జరిగిన భూ కేటాయింపులు చెల్లవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తదుపరి విచారణను జూలై 5వ తేదీకి వాయిదా వేశారు.

రెడ్డి సొసైటీకి ఇచ్చిన భూమిపై..

రెడ్డి కాలేజీ సొసైటీకి బద్వేల్​లో కేటాయించిన భూమిపై సామాజిక కార్యకర్తలు రాజేశ్వరరావు, విజయ్​కుమార్​దాఖలు చేసిన పిల్​పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎకరానికి రూపాయి చొప్పున ధర నిర్ణయించి సొసైటీకి అయిదు ఎకరాలను కట్టబెట్టటం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్లు తమ పిటీషన్​లో పేర్కొన్నారు. 2018లో భూమిని కేటాయిస్తే అయిదేళ్ల తరువాత ఇప్పడు ఎందుకు పిల్​వేశారని జడ్జి వారిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా భూ కేటాయింపునకు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెబ్​సైట్​లో అప్​లోడ్​చేయలేదని పిటీషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్​సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో పిల్​వేయటంలో జరిగిన జాప్యానికి కారణాలు, భూమి ప్రస్తుతం ఏ దశలో ఉందన్న వివరాలను అఫిడవిట్​రూపంలో కోర్టుకు సమర్పించాలని జడ్జి సూచించారు. తదుపరి విచారణను జూన్ ​23వ తేదీకి వాయిదా వేశారు.

Next Story

Most Viewed