కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?

by Dishafeatures2 |
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుక్కలను నియంత్రించే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడంతా కుక్కల మీదే చర్చ నడుస్తోంది. అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి? పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కరవడంలో ఎలాంటి తేడా ఉంటుంది? అనే విషయాలపై జోరుగా చర్చ నడుస్తోంది.

పెంపుడు కుక్కలు, వీధి కుక్కలంటే ఏంటీ?

పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు అని కుక్కలు రెండు రకాలు. పెంపుడు కుక్కలపై వాటిని సంరక్షించే బాధ్యత యజమానులదే. వాటికి కావాల్సిన ఆహారం మొదులుకొని మందుల వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఇక రెండో రకం.. వీధి కుక్కలు. ఇవి వీధుల్లో తిరుగుతుంటాయి. వీటికి ఎలాంటి యజమాని ఉండరు. వీటి సంరక్షణ బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలు లేదా మున్సిపాలిటీలు తీసుకుంటాయి. జంతు సంరక్షణ చట్టం ప్రకారం కుక్కలను చంపడం నేరం. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తుంటారు. వీధి కుక్కలను పట్టుకోవడం, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం వంటివి ప్రభుత్వం చేసే పనులు.

అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి?

ఎవరైనా వ్యక్తిని చూసినప్పుడు కుక్కలు కరవడానికి గల ప్రధాన కారణం అవి అభద్రతాభావానికి లోనవడం. రోడ్లు, పార్కులు, షాపుల ముందు వీధి కుక్కలు ఉంటుంటాయి. ఎవరైనా అవి ఉండే ప్రదేశానికి వస్తే తమను ఏమైనా చేస్తారనే భయంతో కుక్కలు దాడి చేస్తుంటాయి. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాక వదలవు. ఇక ఇంకో ప్రధానం కారణం కుక్కలకు తిండి దొరక్కపోవడం. ఎండ, చలి, వాన సమయాల్లో తమకు షెల్టర్ దొరకనప్పుడు కూడా ఏం చేయాలో పాలుపోక కుక్కలు మనుషుల మీదకు దాడికి దిగుతాయి.

కుక్క కరిస్తే ఏమవుద్ది?

రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు.

కుక్క కరిస్తే ఏం చేయాలి?

అసలు కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఆ ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉంది? కుక్క కాటు.. ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఉండాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తెలుసుకుందాం. కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. దీని వల్ల కరిచిన కుక్కకు రేబిస్ ఉంటే దాని నుంచి మనల్లి రక్షించుకోవచ్చు. బిస్ సోకితే ప్రపంచం ఎక్కడ ట్రీట్మెంట్ లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Next Story

Most Viewed