65 లక్షల మంది రైతులేనా..? పెరిగిన ఆ స్కీం లబ్ధిదారుల సంఖ్య

by Disha Web Desk 4 |
65 లక్షల మంది రైతులేనా..? పెరిగిన ఆ స్కీం లబ్ధిదారుల సంఖ్య
X

సాగు భూముల్లో బహుళంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. పొలాలు వెంచర్లుగా మారుతున్నాయి. వ్యవసాయం చేసే భూ విస్తీర్ణం నానాటికి తగ్గిపోతున్నది. అయినా రాష్ట్రంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నది. నాలుగేండ్లలో కొత్తగా 15 లక్షల మంది పట్టాదారులు పుట్టుకొచ్చారు. జనాభాలో మూడో వంతు మందికి భూమి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

వీరందరికి రైతుబంధు నిధులు జమవుతున్నాయి. అయితే వీరిలో పంటలు సాగు చేస్తున్న వారెవరనేది ప్రశ్నార్థకం. చాలా మంది సోషల్ స్టేటస్, ఇన్వెస్ట్ మెంట్ పర్పస్ కోసం మాత్రమే భూములు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసమే చుట్టూ ఫెన్సింగ్ వేసి భూములను అలాగే వదిలిపెడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో:

నాలుగేండ్ల క్రితం వరకు 50 లక్షలుగా ఉన్న రైతుల సంఖ్య.. ఇప్పుడు 65 లక్షలు దాటింది. అయితే వీరంతా నిజంగా రైతులేనా? కేవలం హక్కుదారులా? అన్న సందేహం కలుగుతున్నది. ఇందులో సగానికి పైగా రైతులు కాదనే ప్రచారం జరుగుతున్నది. ఒకరి పేరుపై ఉన్న భూమిని వారసుల పేర్లపై రాస్తుండడంతో ఈ సంఖ్య పెరుగుదలకు ఒక కారణం కాగా.. పట్టణాల్లో ఉండేవారు పట్టాదారులుగా మారడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.

తమ పేరిట కొంతైనా సాగు భూమి ఉండి, ఎంతో కొంత రైతుబంధు నగదు తమ బ్యాంకుల్లో క్రిడెట్ కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గి, వ్యవసాయేతర వినియోగం పెరుగుతున్న హెచ్ఎండీఏ పరిధి, శివారు ప్రాంతాల్లోనే పట్టాదారుల సంఖ్య పెరుగుతున్నది. వీళ్లలో చాలా మంది భూములను పెట్టుబడి మార్గంగా భావించి, వాటిని ఫెన్సింగ్ వేసుకొని అలాగే వదిలేస్తున్నారు.

చిన్న రైతులే అధికం

రాష్ట్రంలో 2.20 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారే 73.6 శాతం మంది ఉన్నారు. అందులోనూ ఎకరం లోపున్న వారే అధికం. గుంట నుంచి ఐదు గుంటల భూమి మాత్రమే ఉన్న వారుసైతం ఉన్నారు. ఇందులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలే అధికం.

భూ విస్తీర్ణం వివరాలు

మొత్తం భూ విస్తీర్ణం - 1,48,70,045 ఎకరాలు

ఎస్సీల వద్ద ఉన్న భూమి - 13,52,793 ఎకరాలు

ఎస్టీల వద్ద ఉన్న భూమి - 19,29,275 ఎకరాలు

బీసీల చేతుల్లో ఉన్న భూమి - 71,46,939 ఎకరాలు

ఇతరుల వద్ద - 44,41,038 ఎకరాలు

రైతుల వివరాలు

మొత్తం రైతుల సంఖ్య - 65,00,286

ఎస్సీలు - 8,54,151

ఎస్టీలు - 8,23,799

బీసీలు - 34,80,994

ఇతరులు - 13,41,342

పెద్దలకే లాభం..

సాగు చేయని, సాగుకు పనికి రాని భూములకు సైతం రైతుబంధు అందుతున్నదని అందరికీ తెలుసు. ఇది పెద్దలకే లాభాలు ఆర్జించి పెడుతున్నది. 10 ఎకరాలకు పైగా ఉన్న భూస్వాములంతా సాగు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వీరిలో వివిధ వృత్తులు, రాజకీయాలు, వ్యాపారాల్లో నిమగ్నమైన వారే అధికం. తమకు వందల ఎకరాలు ఉన్నాయని, లక్షల్లో రైతుబంధు సొమ్ము ఖాతాల్లో జమ అవుతుందంటూ కామెంట్ చేసిన మంత్రులు కూడా ఉన్నారు. ఇక వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కూడా వందల ఎకరాల భూమి ఉన్న విషయం తెలియనిది కాదు. ప్రతి నెలా రూ.కోట్లు సంపాదించే వ్యాపారుల ఖాతాల్లోనూ రైతుబంధు సొమ్ము జమ అవుతున్నది. ఎవరికి వ్యవసాయ పెట్టుబడి అవసరమో, అంత వరకు పరిమితం చేయడం ద్వారా రూ.వేల కోట్ల బడ్జెట్ దుర్వినియోగం కాకుండా నిలువరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


లబ్ధిదారుల పెరుగుదల ఇలా..

సంవత్సరం పట్టాదారులు

2‌‌018–19 49,48,599

2019–20 50,97,773

2020–21 57,20,792

2021– 22 60,01,800

2022–23 65,00,286

– నాలుగేండ్లల్లో పెరిగిన రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 15,51,687

అత్యధిక లబ్ధిదారులు ఉన్న జిల్లాలు

జిల్లా 2021 2022

నల్లగొండ 4,55,538 4,83,876

సంగారెడ్డి 3,07,092 3,36,560

ఖమ్మం 3,07,286 3,16,643

రంగారెడ్డి 2,85,734 3,05,296

సిద్ధిపేట 2,82,210 3,04,928

నాగర్ కర్నూల్ 2,68,363 2,88,908

సూర్యాపేట 2,54,039 2,67,946


Next Story

Most Viewed