అన్నంత పని చేసిన విద్యుత్ శాఖ.. 200 మంది ఆర్టిజన్లు ఔట్!

by Disha Web Desk 19 |
అన్నంత పని చేసిన విద్యుత్ శాఖ.. 200 మంది ఆర్టిజన్లు ఔట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఆర్టిజన్లు తమకు 51 శాతం ఫిట్ మెంట్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో పాల్గొంటే తొలగిస్తామని హెచ్చరించిన విద్యుత్ శాఖ అన్నంత పని చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ఆర్టిజన్లను తొలగించినట్లు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. డిస్కంలు, ట్రాన్స్ కో పరిధిలో 200 మందిని తొలగించామని, కేటీపీఎస్‌లో ముగ్గురిని టర్మినేట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా జెన్ కో లో ఎవరూ సమ్మెలో పాల్గొనలేదని, వంద శాతం ఆర్టిజన్లు విధులకు హాజరయ్యారని ఆయన స్పష్టంచేశారు. పలువురు ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొన్నా ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీపై పడలేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు అందించే విద్యుత్‌లో అంతరాయాలు లేవని నివేదికలు అందినట్లు తెలిపారు.

జెన్ కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లు వందకు వంద శాతం హాజరవ్వగా ట్రాన్స్ కో, డిస్కంలలో 80 శాతం మంది ఆర్టిజన్లు విధులకు హాజరైనట్టు వెల్లడించారు. విద్యుత్ సంస్థలో ఎస్మా చట్టాన్ని అమలుచేస్తున్నామని, దీనిపై ఇప్పటికే ఒప్పందం కూడా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక సమ్మెలో పాల్గొన్న దాదాపు 200 మంది ఆర్టిజన్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వినియోగదారులకు అందిస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాను భగ్నం చేసే ఏ దుశ్చర్యలనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. బుధవారం ఉదయంలోగా ఇతర ఆర్టిజన్లు విధులకు హాజరవ్వాలని, లేదంటే వారిపైనా వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed