'లాక్‌డౌన్' ఒక్క రోజుకే సరి!

by  |
లాక్‌డౌన్ ఒక్క రోజుకే సరి!
X

దిశ, న్యూస్ బ్యూరో

ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం ‘లాక్‌డౌన్’లో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ, ‘జనతా కర్ఫ్యూ’ రోజున ప్రజల నుంచి కనిపించిన స్పందన సోమవారం కనిపించలేదు. అంతర్ రాష్ట్ర ప్రైవేటు బస్సు సర్వీసులు సహా ఐటీ కంపెనీల క్యాబ్ సర్వీసులు, ప్రైవేటు వాహనాలు యథేచ్ఛగా రోడ్లమీదకు వచ్చాయి. కీలకమైన ట్రాఫిక్ జంక్షన్లలో ఉన్న పోలీసులు సైతం మౌనంగానే ఉండిపోయారు. ఇంతకూ హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఉన్నట్లా లేనట్లా అనే సందేహం కలుగుతుంది. కొన్ని ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉందంటే రోడ్లపై వాహనాలు ఏస్థాయిలో తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు తొలి రోజు అనూహ్య స్పందన వచ్చినా రెండోరోజు మాత్రం ప్రజలు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఏ ప్రజల కోసం ప్రభుత్వాలు ‘లాక్‌డౌన్’ నిర్ణయం తీసుకున్నాయో ఆ ప్రజలే అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక కొన్ని ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ ఉత్తర్వులను గాలికొదిలేశాయి. సెలవు ప్రకటించకుండా యథావిధిగా పనిచేయడం ప్రారంభించాయి.

ఖాళీగా ఉన్న రోడ్లమీద సరదాగా తిరుగుదామని హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్‌తో తిరిగేవారు కొందరైతే, ప్రభుత్వ ఉత్తర్వులపట్ల సీరియస్‌గా స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారు మరికొందరు. ఇక ప్రైవేటు కంపెనీలు సెలవు ప్రకటించకపోవడంతో డ్యూటీకి వెళ్ళేవారు ఇంకొందరు. అంతర్ రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినా పొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు నగరంలోకి స్వేచ్ఛగా వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం చెక్‌పోస్టులు పెట్టినా ఫలితం లేకపోయింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ప్రైవేటు బస్సు సర్వీసులకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ఇక నగరంలో రోజువారీ తిరిగే ఆటోలు, ప్రైవేటు క్యాబ్ సర్వీసుల సంగతి సరేసరి.

రాష్ట్రంలో రోజుకు నాలుగైదు పాజిటివ్ కేసులు నమోదవుతున్నా దాని తీవ్రత ప్రజల మెదళ్ళకు ఎక్కలేదు. ఇంటికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా ప్రభుత్వాలు పిలుపునిస్తే ఒక్క రోజుతోనే దాన్ని సరిపెట్టుకున్నారు. నిత్యావసర వస్తువుల పేరుతో దుకాణాలు కూడా యథావిధిగా తెరుచుకున్నాయి. స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు నీరుగారిపోవడంతో స్వయంగా ప్రధాన కార్యదర్శి, డీజీపీ రంగంలోకి దిగి బలవంతంగానైనా కఠినచర్యలను అమలు చేయకపోతే పరిస్థితి అదుపులోకి రాదని తెలుసుకున్నారు. దీంతో అత్యవసర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీచేశారు. అకారణంగా రోడ్లమీద ఆటోలు, క్యాబ్ సర్వీసులు కనిపిస్తే వాటికి జరీమానాలు వసూలు చేయడంతోపాటు సీజ్ చేస్తామని ఘాటైన స్వరంతోనే హెచ్చరించారు. వెంటనే స్థానిక పోలీసులు మేడ్చల్ రహదారిలో ఉన్న సుచిత్ర సర్కిల్ దగ్గర ఐదు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.

ప్రజల నిర్లక్ష్యానికి పరాకాష్ట

నిత్యావసర వస్తువుల కోసం ఇంటికొక్కరు మాత్రమే రోడ్ల మీదకు రావాలని స్వయంగా ముఖ్యమంత్రి వెసులుబాటు కల్పించినా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ప్రతీ వ్యక్తి కనీసంగా మూడు మీటర్ల దూరాన్ని పాటించాలని కోరినా చాలాచోట్ల దాన్ని బేఖాతరు చేశారు. హిమాయత్‌నగర్‌లోని ఒక దుకాణం దగ్గర వస్తువులు అందుతాయో లేదోన్న ఆందోళనతో ఒకరిని ఆనుకుని మరకొరు నిల్చున్న దృశ్యాన్ని చూస్తే జాగ్రత్తలను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. క్యూలో నిల్చుకునే క్రమశిక్షణ పాటించినా ముఖాలకు మాస్క్‌లు మాత్రం లేవు. దూరం పాటించాలన్ని నిబంధనను పట్టించుకోలేదు. ట్రాఫిక్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో రోడ్లమీదకు వచ్చినవారిని పట్టించుకోకుండా వదిలేశారు. రోజూ నగరంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో సోమవారం కూడా అలానే కనిపించింది.

ఏదో ఒక అవసరం పేరుతో ప్రజలు రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కనీస బాధ్యతను కూడా మరిచారు. ప్రజల్లో ఇంతటి నిర్లక్ష్యం ఉండడంతోనే ఇక అవగాహనతో పనులు నడవవని, కఠిన నిబంధనల పేరుతో భయం ఉండాల్సిందేనని స్వయంగా డీజీపీ, ప్రధాన కార్యదర్శి రంగంలోకి దిగారు. కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. ఒక్కరోజుతోనే సరిపెట్టుకుని నిర్లక్ష్యం చేస్తే ఈ నెలాఖరు వరకు పట్టుదలగా పాటించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందని ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఆందోళనపడ్డారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు. దాని ఫలితే రోడ్లపై వాహనాలను కట్టడిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను, ఆటోలను సీజ్ చేసి జరిమానాలు విధించడం.

Tags : Telangana, LockDown, Public, Negligence, DGP, Chief Secretary, Serious, Autos, Seized


Next Story