మాజీ ప్రధాని కొడుకు, మనవడిపై లైంగిక వేధింపుల కేసు

by Dishanational6 |
మాజీ ప్రధాని కొడుకు, మనవడిపై లైంగిక వేధింపుల కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధాని, జేడీఎస్‌ వ్యవస్థాపకుడు దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ రాకెట్ లో నిందితుడిగా తేలారు. మహిళలపై ఆయన లైంగికదాడికి పాల్పడుతున్న వీడియో క్లిప్పింగ్స్‌ హసన్‌ జిల్లాలో వైరల్‌గా మారాయి. వీటిలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణ నివాసంలో 47 ఏళ్ల మహిళ సహాయకురాలిగా పనిచేస్తుంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ తండ్రి హోలె నరసిపూర్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను నిందితుడిగా పేర్కొంది.

హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ తమ ఇంట్లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. పనిలో చేరిన నాలుగు నెలల తర్వాత తనను చిటికీమాటికీ రేవణ్ణ గదికి పిలుస్తూనే ఉన్నాడని పేర్కొంది. ఇంట్లో మొత్తం ఆరుగురు ఆడ పనివాళ్లు ఉన్నారని.. వారు ప్రజ్వల్ ఇంటికి వస్తే భయపడిపోయేవారమని చెప్పేవారని తెలిపింది. ఇంట్లో పనిచేసే మగ వర్కర్లు కూడా మహిళలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. హెచ్‌డీ రేవణ్ణ భార్య ఇంట్లో లేని సమయంలో మహిళ వర్కర్లనున స్టోర్ రూంకి పిలిచి, వారికి పండ్లు ఇస్తూ వారిని ముట్టుకునే వాడని, చీర పిన్నులు తీసేసి, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడే వాడని ఆమె తెలిపింది.

మరోవైపు, ప్రజ్వల్ రేవణ్ణ తన కుమార్తెతో సరసాలాడేందుకు ప్రయత్నించాడని, ఆమె అతని నంబర్‌ను బ్లాక్ చేసిందని ఆ మహిళ పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354ఏ, 354డీ, 506, 509 కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు అశ్లీల వీడియోల కేసు దుమారం చెలరేగడంతో ప్రజ్వల్ భారత్ వీడినట్లు తెలుస్తోంది. ఆయన బెంగళూర్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ కేసులో విచారణ జరిపించాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మీ చౌధరీ రాసిన లేఖను ప్రధానంగా తీసుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మరోవైపు, ప్రజ్వల్‌ రేవణ్ణ హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఈనెల 26న పోలింగ్‌ జరిగింది.

ప్రజ్వల్‌ రేవణ్ణ పేరు చెడగొట్టడానికి నవీన్‌ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్‌లను వైరల్‌ చేశారని జేడీఎస్‌-బీజేపీ ఎన్నికల ఏజెంట్‌ పూర్ణచంద్ర గౌడ ఆరోపించారు. మార్ఫింగ్‌ వీడియోలను హసన్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు పంపించినట్లు చెప్పారు. అంతేకాదు రేవణ్ణకు ఓటేయొద్దని కోరినట్లు పూర్ణచంద్రగౌడ చెప్పారు.

ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. నేరాలకు పాల్పడిన వారు చట్టం ప్రకారం చర్యలకు అర్హులని చెప్పారు. విచారణ ద్వారా అన్ని నిజాలు బయటకు రావాలని పిలిచారు. ఎవరు తప్పు చేసినా.. క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయంపై దర్యాప్తు నివేదిక బయటకు వచ్చిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు.



Next Story

Most Viewed