పాతబస్తీలో గెలిచి చూపిస్తా: కాంగ్రెస్ అభ్యర్థి సమీర్

by Disha Web Desk 12 |
పాతబస్తీలో గెలిచి చూపిస్తా: కాంగ్రెస్ అభ్యర్థి సమీర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాతబస్తీలో తాను గెలిచి చూపిస్తానని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రజల గోడు వినని పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్(ఎంఐఎం), భారతీయ జనతా పార్టీ (బీజెపి) రెండూ స్వర్ధ ప్రయోజనాల కోసం మాత్రమే గెలవాలని చూస్తున్నాయన్నారు.హైదరాబాద్ నియోజకవర్గానికి ఎంఐఎం తో పాటు బీజేపీకి చెందిన ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, 43 మంది కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, అయినా ఒక్కరు కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు.

పాతబస్తీని అద్భుతంగా తీర్చి దిద్దే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజల జీవన పరిస్థితులను పట్టించుకోలేదన్నారు. ఎంఐఎం నాయకుల నిర్లక్ష్యం వలన చార్మినార్, మక్కా మసీదు, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ ,కుతుబ్ షాహీ టూంబ్స్ వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలు కూడా దెబ్బతింటున్నాయని ఆరోపించారు. పాతబస్తీలోని లాడ్ బజార్, పాతేర్‌గట్టి వంటి చారిత్రక మార్కెట్‌లలో అభివృద్ధి ,మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్నాయని, దీనికి దూరదృష్టి గల నాయకత్వం లేక పోవడమే కారణమని విమర్శించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌ను తలపించేలా హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే చిత్తశుద్ధి లేకపోవడం, ఎంఐఎం, బీజేపీల మతతత్వ రాజకీయాల కారణంగా ఆ హామీ నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed