మేం రాలేం.. మరో తేదీని ఖరారు చేయండి

by  |
మేం రాలేం.. మరో తేదీని ఖరారు చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేపు జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​కుమార్​ఆదివారం విడివిడిగా లేఖలు రాశారు. రాష్ట్ర సభ్యులు బోర్డు సమావేశానికి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ గతంలోనే లేఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర్వహిస్తామని, హాజరుకావాలని కేఆర్ఎంబీ, జీఆర్ ఎంబీలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి.

శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోమారు లేఖలు రాసింది. కేసుల విచారణ కారణంగా సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరు కాలేమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సభ్యులు బోర్డు భేటీకి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని సూచించాలని రెండు బోర్డులను కోరారు. పాలనాపరమైన అంశాలతో పాటు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలను కూడా తదుపరి సమావేశ ఎజెండాలో చేర్చాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరారు. లేఖల ప్రతులను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి కార్యాలయానికి కూడా పంపించారు.


Next Story

Most Viewed