విలాసాల్లో తెలంగాణ ప్రభుత్వం.. కరోనా కాలంలోనూ ‘లగ్జరీ’కి పెద్దపీట

by  |
CM KCR Car
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏడేండ్ల తెలంగాణలో అధికారులకు ఖరీదైన కార్లు వచ్చాయి. పాత వాహనాలు కండిషన్​లో ఉండగానే కొత్త వాహనాలు దూసుకొచ్చాయి. ప్రజాప్రతినిధులకు విలాసవంతమైన వాహనాలు సమకూర్చారు. ఇదే సమయంలో ప్రజా రవాణా నిర్లక్ష్యానికి గురైంది. ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సు కొనలేదు. తాజాగా రాష్ట్రంలోని అడిషనల్​ కలెక్టర్లకు మరో 32 కియా కార్లు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ విలాసాలపై చర్చ మొదలైంది.

2014 నుంచి నిన్నటి వరకు రాష్ట్రంలో 20,104 కొత్త కార్లు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం రికార్డుకెక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లగ్జరీ అడ్మినిస్ట్రేషన్​గా మారిపోయింది. ఓవైపు ఆదాయం లేదు… అప్పులు పెరిగిపోయాయి అంటూ సర్కారు భూములన్నీ అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం… విలాసాల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదని రూఢీ చేసుకుంటోంది.

విలాసాలకు ఖరీదు

2014లో పోలీసు డిపార్టుమెంటు కోసం 4,433 ఇన్నోవా కార్లను కొన్నది. ఇందుకోసం రూ. 271 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో 3,883 కార్లను హైదరాబాద్‌కు కేటాయించగా… మిగిలిన 550 కార్లను జిల్లాల్లో కేటాయించింది. వీటి కోసం ప్రతీనెలా హైదరాబాద్‌లో రూ. 75,000, జిల్లాల్లో రూ. 50,000, గ్రామాల్లో రూ. 25,000 చొప్పున పెట్రోలు అవసరాల కోసం ప్రభుత్వం కేటాయిస్తూ ఉన్నది. అంతకు ముందు పోలీస్​ శాఖ దగ్గర 5,703 వాహనాలున్నాయి.

ఆ తర్వాత వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం వందల కోట్లు వెచ్చిస్తూనే ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో పాటుగా అన్ని జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు ఫార్చూనర్​ కార్లను కొనిచ్చారు. వాస్తవంగా ఉమ్మడి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా అప్పటికే పాత వాహనాలు ఉన్నాయి. అవన్నీ కండీషన్​లోనే తిరుగుతున్నాయి. కానీ కొత్త కార్లను కొనుగోలు చేశారు. 2015లో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కోసం 21 ఫార్చూనర్​ వాహనాలు తీసుకుంది. అనంతరం ఇదే సమయంలో జిల్లా ఎస్పీలు, కమిషరేట్ల పరిధిలో కమిషనర్లు, అడిషనల్​ కమిషనర్ల కోసం ఫార్చూనర్లను తీసుకున్నారు. వీటితో పాటుగా ఇరిగేషన్​ శాఖలో 2016లో సీఈలకు ఆరు ఇన్నోవాలు, మరో రెండు టయోటా ఇతియాస్​ వాహనాలను తీసుకుంది.

అంతేకాకుండా 28 సర్కిళ్లలో సూపరింటెండెంట్​ ఇంజినీర్ల కోసం 28 మహింద్రా బోలేరా, 8 టయోటా ఇతియాస్​ కార్లు తీసుకుంది. అదేవిధంగా గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు ఇంజినీర్ల కోసం రెండు ఇన్నోవా, ఒక బోలేరా, రెండు టయోటా ఇతియాస్​ కార్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2018లో 32 మంది జిల్లా పరిషత్​ ఛైర్మన్లకు ఒక్కోక్కటి రూ. 40 లక్షల చొప్పున ఫార్చూనర్​ కార్లను కొనుగోలు చేసింది. జనరల్​ ఫండ్​ నుంచి ఈ నిధులు వినియోగించింది. వీటితో పాటుగా రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శులు హోండా సిటీ, టొయోటా కామ్రీ, కొరోల్లా లాంటి కార్లు వాడుతున్నారు. కొద్దిమంది స్కోడా హై ఎండ్ కార్లను వాడుతున్నారు.

తాజాగా రాష్ట్రంలోని అడిషనల్ కలెక్టర్ల కోసం కొత్త కియా కార్నివాల్ కార్లు సిద్ధమయ్యాయి. వీటిని త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అప్పగించనున్నారు. ఇప్పటి వరకు వారి దగ్గర పాత ఇన్నోవా, బొలెరో కార్లు ఉన్నాయి. వాటిని గతంలో కలెక్టర్లు వాడినవే వీరికి ఇచ్చారు. కానీ కారణాలేమిటో తెలియదు కానీ.. వాటిని పక్కన పెట్టి 32 కొత్త కియా కార్లను తెప్పించారు.

నిద్రకు అనుకూలంగా పోలీస్​ ఇన్నోవాలు

పోలీసులకు వందల కోట్లు ఖర్చు పెట్టి కొనిచ్చిన ఇన్నోవా వాహనాలు నిద్రకు అనుకూలంగా మారాయనే సెటైర్లు వస్తున్నాయి. ఇటీవల మెదక్​ జిల్లా కౌడిపల్లి పీఎస్​ పరిధిలోని ఇన్నోవా వాహనాన్ని రహదారి పక్కన నిలిపి, పోలీసులు దర్జాగా నిద్రపోతున్న వీడియో నెట్టింటా వైరల్​గా మారింది. అప్పుడప్పుడు మంత్రులో, వీవీఐపీల పర్యటన సందర్భాలను మినహాయిస్తే… గ్రామీణ ప్రాంతాల్లోని ఇన్నోవాల పరిస్థితి ఇదేనంటున్నారు.

20,104 వాహనాలు కొనుగోలు

రాష్ట్రంలో ఏడేండ్ల కాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లు 20,104గా నమోదయ్యాయి. ఇవన్నీ రాష్ట్ర రవాణా శాఖ అధికారిక లెక్కలే. ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు అధికారికంగా చూపించారు. వీటితో పాటుగా సీఎం కేసీఆర్​ కాన్వాయిలో ఖరీదైన ల్యాండ్​ క్రూయిజర్లు ఉండగా… మంత్రుల కాన్వాయిలో ఫార్చూనర్లు వినియోగిస్తున్నాయి.

కేంద్రస్థాయి అధికారుల కంటే మనోళ్లే కాస్ట్​లీ

ఢిల్లీస్థాయిలో పని చేసే కేంద్ర ప్రభుత్వ అధికారులు… జాయింట్​ సెక్రెటరీ స్థాయిలో వినియోగించే కార్లతో పోలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాడుతున్న కార్లు రెండింతలు ఖరీదైనవి. కేంద్రంలో జాయింట్​ సెక్రెటరీ స్థాయి అంటే రాష్ట్ర సీఎస్​ స్థాయి అధికారులు. ఆ స్థాయిలో అత్యధిక స్థాయిలో ఉన్న అధికారులు వినియోగించే కార్ల ఖరీదు రూ.14 లక్షలలోపే. కానీ మన రాష్ట్ర అధికారులు మాత్రం కొంత సీనియర్​ అయినా ఫార్చూనర్, ఇన్నోవా వంటి వాహనాలను వాడుతున్నారు. దానికి నిర్వహణ కూడా ఎక్కువే.

ఒక్క బస్సూ కొనలేదు

వాహనశ్రేణిలో లగ్జరీని చూపిస్తున్న ప్రభుత్వం… ప్రజారవాణాను మాత్రం పట్టించుకోలేదని తేటతెల్లమైంది. ఏడేండ్లలో ఒక్క ఆర్టీసీ బస్సును కూడా కొనలేదు. వాస్తవంగా ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 9,400 బస్సులు ఉండగా.. వీటిలో 3,800 బస్సులు గ్రేటర్​ పరిధిలోనివి. గ్రేటర్​ పరిధిలో 864 బస్సులు, రాష్ట్ర వ్యాప్తంగా 2100 బస్సులు కాలం చెల్లాయి. గత ఏడాది లాక్​డౌన్​ కారణంగా బస్సులను పక్కన పెట్టగా… ఈ 2100 బస్సులను రోడ్డెక్కించలేదు. గ్రేటర్​లో 864 బస్సులు కూడా డిపోల్లోనే ఉన్నాయి. ఈ బస్సులను బయటకు తీస్తే నడువడం లేదని పక్కన పెట్టి వాటి విడిభాగాలను తీసి ఇతర బస్సులకు వాడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్​ పరిధి పెరుగుతున్నా రవాణా వ్యవస్థ మాత్రం సరిపడా లేదు. చాలా ప్రాంతాలకు ఇప్పటికీ బస్సులు నడువడం లేదు.

1300 బస్సులు కొనాలని ప్రతిపాదనలు

వాస్తవంగా 2019 నుంచి కొత్త బస్సులను కొనాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు చేస్తోంది. కానీ ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకూ కొనుగోలు చేయలేదు. ఒక్కో బస్సుకు రూ. 22 లక్షలు అవుతాయని ప్రతిపాదనల్లో వెల్లడించారు. కొత్త బస్సుల కొనుగోళ్లను వద్దంటూ ప్రభుత్వం హైర్​ బస్సులకు ప్రాధాన్యత ఇస్తోంది. అవి కూడా కేవలం శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ వరకే కొన్నింటినీ అద్దెకు తీసుకున్నారు. ఈ బస్సులు మినహా ఒక్క బస్సు ఆర్టీసీకి రాలేదు.

కరోనా కష్టకాలం అంటూనే కొత్త కార్లు

పల్లె, పట్టణ ప్రగతి అధ్వానంగా ఉందని, అదనపు కలెక్టర్లు శ్రద్ధగా పనిచేయడం లేదని మూడు రోజుల క్రితం సీఎం చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. తిట్లు తిన్న అదనపు కలెక్టర్లకే ఇప్పుడు 32 కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేశారు. పని చేయడం లేదని ఒకవైపు చెప్తూనే మరోవైపు వారికి కొత్త కార్లను సమకూర్చింది. మరోవైపు కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. అందినకాడల్లా అప్పులు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆదాయం ఘోరంగా ఉందంటూ ప్రభుత్వ ఆధీనంలోని భూములన్నీ అమ్ముతున్నారు. ఆదాయం పోయిందని అంటూనే… లగ్జరీకి ప్రియార్టీ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రవాణా వ్యవస్థను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు

ప్రజా రవాణా వ్యవస్థను ఎంత మేరకు నిర్లక్ష్యం చేస్తున్నారో కండ్ల ముందే కనిపిస్తోంది. విశ్వనగరంగా పెరుగుతున్నా ఒక్క బస్సును కూడా పెంచడం లేదు. ఇప్పటికే డిపోల్లో వందల బస్సులు పనికిరాకుండా ఉన్నాయి. ఉన్న బస్సుల్లో చాలా మేరకు అతుకులతోనే నడుస్తున్నాయి. వాటిని నడుపలేక డ్రైవర్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ముందుగా ప్రజా రవాణాకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం… ఇంత నిర్లక్ష్యం ఎందుకో.
– రాజిరెడ్డి, ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి

విలాసాల కోసమే కోట్లు వృథా

రాష్ట్ర ప్రభుత్వం విలాసాల వ్యవహారం మరోసారి బయటపడింది. అన్ని జిల్లాల్లో ఇప్పటికే అవసరానికి మించి వాహనాలు ఉన్నా… ఇప్పుడు మళ్లీ కొత్త వాహనాలను ఎందుకు కొన్నారో అర్థం కాని పరిస్థితి. జిల్లాస్థాయిలో కూడా అధికారులకు ఫార్చూనర్లు ఇస్తున్నారు. నిర్వహణ కోసమే ప్రతినెలా కోట్లు వెచ్చిస్తున్నారు. అసలే అప్పుల తెలంగాణగా మారింది. ఇప్పుడు అప్పులతో లగ్జరీ తెలంగాణగా మారుస్తున్నారు.
-దాసోజు శ్రవణ్​, ఏఐసీసీ అధికార ప్రతినిధి

Next Story

Most Viewed