కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్పా.. చేసేదేమీ లేదు..!

by  |
కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్పా.. చేసేదేమీ లేదు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎన్ని నిధులొస్తాయనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఉత్కంఠలో ముంచెత్తింది. అధికార పార్టీ ఎంపీల్లోనూ అదే ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్ సమర్పిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు వచ్చే కేటాయింపులపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు. ఏయే కేంద్ర పథకాల కింద ఏ మేరకు నిధుల కేటాయింపు ఉంటుందని ఎదురుచూస్తున్నారు. గతంలో డిమాండ్ చేసి మరీ సాధించుకున్న తెగింపు టీఆర్ఎస్ ఎంపీల్లో ఈసారి కనిపించడంలేదు. బడ్జెట్‌లో కేంద్రం చేసిన కేటాయింపులతో సర్దుకోవడమే తప్ప ఇప్పుడు వత్తిడి చేయడమో లేక పార్లమెంటులో గళమెత్తి నిరసన తెలియజేయడమో సాధ్యం కాదని ఎంపీలే చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు లోక్‌సభలో ప్లాకార్డులు ప్రదర్శించడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చొని నిరసన తెలపడం, నినాదాలు చేయడం లాంటివి ఇకపైన ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు ఎంపీల నుంచి వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కేంద్రం నుంచి నిధులు అందుతాయన్న ఆశలేదని, ఇచ్చిన మేరకు పుచ్చుకోవడమే తప్ప చేయగలిగిందేమీ లేదని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు ‘దిశ’కు వివరించారు. ”రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాల్లో కేంద్రానికి లేఖలు రాసింది. మన మంత్రులు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ నిధులు మాత్రం రాలేదు. అడిగీ అడిగి విసుగొచ్చింది. వస్తాయన్న ఆశలు కూడా లేవు. కరోనా పేరుతో ఈసారి అంతకంటే దారుణ పరిస్థితులే ఉంటాయేమో. ఇచ్చినకాడికి తీసుకోవడమే తప్ప డిమాండ్ చేసినా ప్రయోజనం ఉండదని అర్థమైంది. ఎలాగూ అడగక తప్పదు” అని వ్యాఖ్యానించారు.

”నీతి ఆయోగ్ నాలుగేళ్ళ కిందటే మిషన్ భగీరధకు రూ. 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5000 కోట్ల మేర సాయం చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని స్వయంగా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సైతం అనేకసార్లు కలిసి కోరారు. కానీ ఇప్పటికీ ఆ సాయం అందలేదు. విభజన చట్టంలోని హామీల మేరకు రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులకు నిధులు రావాల్సి ఉంది. అవి కూడా అందలేదు. నామమాత్రపు నిధులు ఇచ్చి సరిపెట్టింది” అని ఆ నేత గుర్తుచేశారు.

వత్తిడి చేయడం అనుమానమే

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో గతంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలియజేసి, గట్టిగా కొట్లాడి, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేసి సాధించుకున్నారు. బీబీ నగర్ ఎయిమ్స్, హైకోర్టు విభజన, నవోదయ విద్యాలయాలు.. ఇలా అనేక అంశాల్లో స్పష్టమైంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. కేంద్రంతో స్నేహ సంబంధాలనే కొనసాగించనున్నట్లు ఎంపీలు పేర్కొన్నందున గతంలోలాగ లోక్‌సభలో లేచి నిలబడి నిరసన తెలియజేసేంత పరిస్థితి ఉండకపోవచ్చన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేయడం, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, నిర్దిష్టంగా పథకాలవారీగా తెలంగాణకు ఇవ్వాలని కోరడం మినహా డిమాండ్ చేసే అవకాశం లేదన్నది ఎంపీల భావన.

గతంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల అమలుకోసం నామమాత్రంగా కేటాయించిన నిధులకు కొనసాగింపుగా మలి విడత నిధులను విడుదల చేయడం లాంటివాటిపై కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తెలంగాణ ప్రభుత్వానికి నిరంతర ప్రాక్టీసుగానే మారింది. జీఎస్టీ రాకపూర్వం సెంట్రల్ సేల్స్ టాక్స్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా నష్ట పరిహారం విషయంలో అదే జరుగుతూ ఉంది. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించడం, ఐటీఐఆర్, రీజినల్ రింగురోడ్డు, తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు, జాతీయ రహదారులను సత్వరం పూర్తిచేయడం, రైల్వే లైన్ పనులను వేగవంతం చేయడం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూలు, ట్రైబల్ వర్శిటీకి నిధులు.. ఇలాంటి అనేక అంశాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని పదేపదే గుర్తుచేస్తామని లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఆర్థిక సంఘం సిఫారసులేమయ్యాయి? : హరీశ్ రావు

రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోడానికి, చట్టబద్ధంగా పన్నుల వసూళ్ళలో వాటా ఇవ్వడానికి ఆర్థిక సంఘం నిర్దిష్ట సిఫారసులు చేసినా అమలు కావడంలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. పదిహేనవ ఆర్థిక సంఘం దేశంలోని మూడు రాష్ట్రాలకు ‘ప్రత్యేక ఆర్థిక సాయం’ ఇవ్వాలని చెప్పినా తెలంగాణకు రావాల్సిన రూ. 723 కోట్లు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఇటీవల జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశాల సందర్భంగా హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు సంబంధించి తొమ్మిది అంశాలను ప్రస్తావించి రానున్న బడ్జెట్‌‌లో వీటిని పరిగణలోకి తీసుకుని స్పష్టమైన నిర్ణయాలను ప్రకటించాలని కోరారు.

కరోనా కారణంగా కేంద్రం కంటే రాష్ట్రాలే ఎక్కువగా నష్టపోయాయని, జీఎస్టీ పరిహారం కూడా సకాలంలో విడుదల కాకపోవడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. కేంద్రం మాత్రం సెస్, సర్‌ఛార్జీ పేరుతో వసూలు చేస్తుండడంతో రాష్ట్రాల పన్నుల వాటాకు నష్టం జరుగుతోందని గుర్తుచేశారు. నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో హరీశ్‌రావు ప్రస్తావించిన అంశాల్లో కొన్ని .. :

• 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లుగా తెలంగాణకు ‘ప్రత్యేక ఆర్థిక సాయం’ కింద రూ. 723 కోట్లు ఇవ్వాలి.

• సెస్, సర్‌ఛార్జీల రూపంలో కేంద్రం వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలికి బేసిక్ పన్నుల్లో కలపడం ద్వారా రాష్ట్రాలకు తగిన వాటా లభిస్తుంది. ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలి.

• కరోనా సమయంలో ‘ఆత్మనిర్భర్ ప్యాకేజీ’లో భాగంగా ఎఫ్ఆర్‌బీఎం పరిధిని అదనంగా రెండు శాతం పెంచిన నిర్ణయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరా (2021-22)నికి కూడా వర్తింపజేయాలి.

• వెనకబడిన జిల్లాలకు ప్రతీ ఏటా రూ. 50 కోట్ల చొప్పున తొమ్మిది జిల్లాలకు రూ. 450 కోట్లను ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికి నాలుగేళ్ళు మాత్రమే వచ్చాయి. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ఇంకా బకాయిలు ఉన్నాయి. వెంటనే విడుదల చేయాలి.

• మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రతీ జిల్లాకు వర్తింపజేయనున్నట్లు గతేడాది బడ్జెట్‌లో హామీ ఇచ్చారు. కానీ సగం జిల్లాలకు మాత్రమే అమలవుతోందని. తెలంగాణలోని అన్ని జిల్లాలకు వర్తింపజేయాలి.

• 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ‘డివొల్యూషన్’ పేరుతో రాష్ట్రానికి రావాల్సిన వాటా పూర్తి స్థాయిలో అందలేదు. ఇంకా రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 3,733 కోట్లు రావాల్సి ఉంది. కానీ రాలేదు.

• బీహార్ ఎన్నికల సందర్భంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చినట్లుగానే తెలంగాణ ప్రజలకు కూడా ఉచితంగానే ఇవ్వాలి. ఇందుకు ఖర్చయ్యే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి.

• ‘జాతీయ సామాజిక ఆర్థిక సాయం’ పథకం కింద అర్హులైనవారికి కేంద్ర ప్రభుత్వం రూ. 200 మాత్రమే ఇస్తోంది. దీన్ని వెయ్యి రూపాయలకు పెంచాలి.

• కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి 28 అంశాలకు కుదించాల్సిందిగా ముఖ్యమంత్రుల స్థాయి కమిటీ (ఇందులో కేసీఆర్ కూడా సభ్యులుగా ఉన్నారు) 2016లో సిఫారసు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఆ పథకాల కింద అవసరమైన నిధులను రాష్ట్రాలకు ఇస్తే దాన్ని ఏ విధంగా ఖర్చు చేసుకోవాలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే స్వేచ్ఛ ఉండాలని కూడా కమిటీ చెప్పింది. దీన్ని కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకు అమలులోకి రాలేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా దీన్ని స్పష్టం చేయాలి.


Next Story

Most Viewed