ఎల్లుండి తెలంగాణ కేబినెట్ మీటింగ్

by  |
KCR-And-Pragati-Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆగస్టు 1న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇటీవల పలు దఫాలుగా చర్చలు జరిపి ‘దళితబంధు‘పై చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, దానికి అవసరమైన అదనపు బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. దీనికి తోడు నేతవృత్తిలో ఉన్నవారికి బీమాను వర్తింపచేసే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత రెండు నెలల వ్యవధిలో ఇది ఐదవ కేబినెట్ సమావేశం. పై అంశాలతో పాటు కరోనా థర్డ్ వేవ్, కృష్ణా-గోదావరి జలాలపై ఉన్న ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉన్నది.

‘దళితబంధు‘ అనే పేరు పెట్టకపోయినప్పటికీ దళితులకు సాధికారిత కల్పించే పథకాన్ని అమలుచేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలోనే పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం గురించి దళిత ప్రతినిధులతో విస్తృతంగా చర్చించిన కేసీఆర్ అమలు సాధ్యాసాధ్యాలపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నాలుగు వేర్వేరు సమావేశాలను నిర్వహించారు. బడ్జెట్‌లో పెట్టుకున్న వెయ్యి కోట్లకు అదనంగా కూడా ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రతీ నిరుపేద దళిత కుటుంబానికి తలా పది లక్షల రూపాయల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయంతీసుకున్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడ ఉప ఎన్నికల నేపథ్యంలో మొత్తం దళిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం 20,929 కుటుంబాల నుంచి అర్హులైనవారిని ఎంపిక చేసి అందిస్తామని, ఇందుకోసం అవసరమైతే రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉన్నందున ఈ సమావేవంలో మంత్రివర్గం ఆమోదం పొందుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక కొత్తగా చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని కూడా అమలుచేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినందున దానిపైన కూడా సమావేశంలో చర్చించి ఆమోదం పొందే అవకాశం ఉన్నది. కేరళలో థర్డ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో సైతం తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సూచనప్రాయంగా తెలిపాయి.

ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత మే 30న ఒకసారి కేబినెట్ భేటీ జరగ్గా, ఆ తర్వాత జూన్ 8, 19 తేదీల్లో, జూలై 13 తేదీల్లో సమావేశాలు జరిగాయి. ఇప్పుడు ఆగస్టు 1న మరో సమావేశం జరుగుతున్నది.



Next Story

Most Viewed