తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

by  |
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సుమారు 4గంటల పాటు ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఏడు నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో ‘నాలా’ చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, జీహెచ్ఎంసీ చట్టం లాంటివాటికి సవరణలు ప్రతిపాదించే అంశాలు కూడా ఉన్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 50% వార్డులు మహిళలకే రిజర్వు కానున్నాయి. మొత్తం 150వార్డుల్లో 75మంది మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రకారం వార్డుల విభజనలో కూడా మార్పులు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్ట సవరణ జరగాల్సి ఉంది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనెల 13, 14 తేదీల్లో అసెంబ్లీ, మండలి సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లులపై చర్చల అనంతరం ఆమోదం లభించనుంది.

ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తులను ప్రజలే స్వచ్ఛందంగా ఆన్‌లైన్ విధానం ద్వారా నమోదు చేసుకోడానికి అక్టోబర్ 20వరకు గడువును పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఇంటింటి సర్వే చేస్తూ వివరాలను సేకరిస్తున్న సిబ్బందికి కూడా ఇదే గడువు వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లన్నీ రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి. ‘ధరణి’ వెబ్‌సైట్ వినియోగంలోకి వచ్చేంత వరకు ఇది కొనసాగనుంది.

‘నాలా’ చట్ట సవరణకు ఆమోదం

వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోడానికి ఉద్దేశించిన ‘నాలా’ చట్టానికి సైతం సవరణ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుతం అమలవుతున్న మాన్యువల్ విధానాన్ని ధరణి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మార్చడానికి నిర్ణయం జరిగింది. మాన్యువల్ విధానం ద్వారా వ్యవసాయేతర కేటగిరీలోకి భూమిని మార్చడానికి అధికారులకు ఉన్న విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకోసమే ఆన్‌లైన్ విధానానికి వెళ్ళాలని నిర్ణయం జరిగినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలే స్వచ్ఛందంగా ఆన్‌లైన్ ద్వారా భూ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని, ఈ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ప్రజలకు మరింత మేలైన సౌకర్యం లభిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.

కేంద్ర విధానాలు వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన చట్టాలు ఆ రంగానికి, రైతులకు గొడ్డలిపెట్టు లాంటిదని మంత్రివర్గం తీర్మానించింది. మొక్కజొన్నల విషయంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి సుంకాన్ని తగ్గించి మరీ కొనుగోలు చేయడం ద్వారా మన దేశంలో ఆ పంటను సాగుచేస్తున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని, కనీస మద్దతు ధర కూడా లభించే అవకాశం లేకుండాపోయిందని మంత్రివర్గ సమావేశం వ్యాఖ్యానించింది.

చివరి గింజవరకూ ధాన్యం కొనుగోళ్ళు

కరోనా సమయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వమే గ్రామాల్లో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను కొన్నట్లుగానే ఇప్పుడు కూడా కొనాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం ఆరు వేల కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లోని ఏర్పాటుచేసి రైతులకు కరోనా సమస్య లేకుండా చేయాలని నిర్ణయించింది.


Next Story

Most Viewed