రోహిత్, రాహుల్ దూరం.. టెస్టుల్లో ఓపెనర్లు ఎవరు?

by  |
రోహిత్, రాహుల్ దూరం.. టెస్టుల్లో ఓపెనర్లు ఎవరు?
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగనున్నది. గురువారం నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా తొలి టెస్టు జరుగనున్నది. తొలి టెస్టు ప్రారంభానికి కొన్ని గంటల ముందు టీమ్ ఇండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎడమ కాలి కండరానికి గాయం కావడంతో కేఎల్ రాహుల్ రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడని బీసీసీఐ పేర్కొన్నది. కేఎల్ రాహుల్ త్వరలో బెంగళూరులోని ఎన్ఏసీకి వెళ్లి అక్కడ గాయం నుంచి కోలుకోనున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే వచ్చే ఏడాది దక్షిణాఫ్రిక పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాదే టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. తాజాగా టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. అయితే కేఎల్ రాహుల్ టెస్టు ఓపెనర్‌గా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే అతడి స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.

ఎవరు ఓపెనింగ్ జోడి?

కేఎల్ రాహుల్ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగడం.. రోహిత్ శర్మకు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించడంతో ఇప్పుడు ఓపెనింగ్ ఎవరు చేస్తారనే అనుమానాలు నెలకొన్నాయి. గతంలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ – శుభమన్‌గిల్‌లను రాహుల్ ద్రవిడ్ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. అయితే సీనియర్ బ్యాటర్లు లేకుండా ఇద్దరు యువకులను ఓపెనింగ్‌కు పంపుతారా అనేది అనుమానంగా మారింది. అయితే అజింక్య రహానే, రాహుల్ ద్రవిడ్‌కు వీరిద్దరి జోడీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో నెంబర్ 3 స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తున్నది. మూడో నెంబర్‌లో సూర్యకుమార్ లేదా శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కినా అరంగేట్రం మ్యాచ్ అవుతుంది. తొలి మ్యాచ్‌లోనే నెంబర్ 3 భారాన్ని వాళ్లు మోస్తారా అనేది కూడా అనుమానమే. నెంబర్ 3లో చతేశ్వర్ పుజారాను పంపి.. ఆ తర్వాత రహానే, శ్రేయస్ అయ్యర్ లేదా సూర్యకుమార్‌లను పంపే అవకాశాలను కూడా కొట్టిపారేయలేము.

బౌలింగ్ సంగతేంటి?

కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌లు బౌలింగ్ విభాగాన్ని నడిపించే అవకాశం ఉన్నది. సిరాజ్ పూర్తి ఫిట్‌గా లేకపోతే ఉమేష్ యాదవ్‌కు చోటు దక్కుతుంది. ఒకవేళ ద్రవిడ్ కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ప్రసిధ్ కృష్ణ తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నది. ఇక వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహకే చోటు దక్కుతుంది. కాన్పూర్ పిచ్‌ కొద్దిగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దీంతో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లో ఎవరికి చోటు దక్కుతుందనేది తేలాల్సి ఉన్నది. ఇంగ్లాండ్ సిరీస్‌లో అక్షర్ పటేల్ విశేషంగా రాణించాడు. దీంతో అశ్విన్‌తో పాటు అక్షర్‌కు చోటు దక్కవచ్చు. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే వీరిద్దరితో పాటు రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా భారత జట్టు అటు సీనియర్లు, ఇటు యువకులతో తొలి సారిగా టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనున్నది. టెస్టు ఫార్మాట్‌లో బలంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌పై గెలవాలంటే భారత జట్టు ఈ సారి పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించాల్సి ఉన్నది.


Next Story

Most Viewed