వాహ్.. వాట్సాప్‌లో టీచింగ్

by  |
వాహ్.. వాట్సాప్‌లో టీచింగ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో పిల్లలకు చదువు చెప్పాలని ఓ ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ ఒక ఆలోచనకు వచ్చారు. టీచర్లతో కలిసి చర్చించి.. ముందుగా పదో తరగతి విద్యార్థులకు వాట్సాప్‌లో పాఠ్యాంశాలు బోధించాలని నిర్ణయించారు. విద్యాకమిటీ, సర్పంచ్, పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. 45 రోజుల క్రితమే విద్యా బోధన విధానంపై వేసుకున్న ప్రణాళిక.. సార్లు చూపిన చొరవ ప్రస్తుతం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.

గంగాధర మండలం ఒద్యారం హైస్కూల్‌లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు చదువు చెప్పేందుకు హెచ్ఎం ప్రభాకర్ వాట్సాప్‌ను వేదిక చేసుకున్నారు. రోజుకో పాఠ్యాంశం చొప్పున చదువు చెప్పడం ఆరంభించారు. వీడియో లేదా టెక్స్ట్ ద్వారా రోజుకో సబ్జెక్ట్ చెప్పే పద్ధతికి శ్రీకారం చుట్టారు. పాఠ్యాంశాలకు సంబంధించిన హోం వర్క్‌ను పూర్తి చేసి, ఫొటో తీసి, వాట్సాప్‌లో టీచర్లకు పోస్టు చేయాలని విద్యార్థులకు చెప్పారు. అప్పటికే 9 నుంచి 10 పదో తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ అందజేయడంతో పాటు పూర్వ విద్యార్థులకు సంబంధించిన నోట్స్ కూడా సేకరించి ఇచ్చారు. వాట్సాప్‌లో టీచర్లు చెప్తున్న విధానాన్ని, విద్యార్థులు స్పందిస్తున్న తీరును ఎప్పటికప్పుడు హెడ్ మాస్టర్ గమనిస్తున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ విద్యార్థులు ఇంటి వద్ద ఉంటూ చదువుకునే పద్దతికి శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యారు.

విద్యార్థులకు మాస్టార్లు పాఠాలు చెప్పే విధానం కూడా ఉంటే బావుంటుందని డీఈఓ జనార్దన్ రావు ప్రతిపాదించారు. ఇందుకు జూమ్ యాప్‌ను వినియోగించాలని సూచించారు. 15 ఆగస్టున విద్యార్థులకు జూమ్ యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పించారు. మరుసటి రోజు నుంచి జూమ్ యాప్ ద్వారా నిత్యం 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం స్టార్ట్ చేశారు. మ్యాథ్స్ టీచర్ కూడా ప్రత్యేకంగా వైట్ బోర్టు ద్వారా ఇంటి నుంచి గణితం చెప్తున్నారు. దీంతో బడి ప్రారంభం కాకున్నా విద్యార్థులకు మాత్రం నిత్య భోదన యథావిధిగా సాగుతోంది. ఆన్ లైన్ చదువులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముందే ఈ హైస్కూల్ సార్లు ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం.

ముందస్తు వ్యూహం..

ఏఏ స్టూడెంట్ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.. లేని వారెవరు అన్న వివరాలు సేకరించారు. స్మార్ట్‌ఫోన్ లేని వారిని గుర్తించి ఫోన్ అందుబాటులో ఉన్న వారితో కలిసి వాట్సాప్ ద్వారా పాఠ్యాంశాలు వినేలా చొరవ తీసుకున్నారు. ఒద్యారం స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి సాయం త్రం వేళల్లోనే పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. రాత్రి వరకు బోధించిన పాఠ్యాంశాన్ని మరునాడు హోం వర్క్ కంప్లీట్ చేసే పద్ధతిని అలవాటు చేశారు. చురుగ్గా వ్యవహరించని స్టూడెంట్స్‌ను గుర్తించి వారితో హెడ్ మాస్టర్ వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడారు. వాట్సాప్‌లో హోం వర్క్ కంప్లీట్ చేసిన విద్యార్థులను అదే గ్రూపుల్ హెడ్ మాస్టర్ ప్రోత్సహించే విధంగా కామెంట్లు చేశారు. దీంతో స్టూడెం ట్స్ వేగంగా స్పందించడం అలవాటు చేసుకున్నారు.

టీశాట్ క్లాసులకు సమాయత్తం..

టీ శాట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు చెప్పాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించడంతో అందుకు తగ్గట్లుగా పాఠశాల టీచ ర్లు సమాయత్తం అవుతున్నారు. లైవ్‌లో వచ్చే సబ్జెక్టు టీచర్ కూడా స్కూల్ లోని టీవీ ముందు కూర్చోవాలి. టీశాట్ లో చెప్పే క్లాస్ పూర్తయిన తరువాత సంబంధిత టీచర్ స్టూడెంట్స్ తో ఫోన్ మాట్లాడి వారికున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్‌తో మాట్లాడి టీ షాట్ ద్వారా లెస్సన్స్ చెప్తున్నందున ఖచ్చితంగా ఈ చానెల్స్ వచ్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు మాస్టార్లు.

విద్యార్థుల భవిష్యత్ కోసమే: ప్రభాకర్, హెడ్ మాస్టర్, ఒద్యారం

విద్యార్థుల భవిష్యత్‌ను కరోనా మహమ్మారి అడ్డుకోవడం బాధగా అనిపించింది. నా నిర్ణయానికి టీచర్లు చేదోడుగా నిలిచారు. పేరెంట్స్ కూడా స్వాగతించారు. వినూత్నంగా ప్రారంభించిన మా ప్రయత్నానికి డీఈఓ జనార్దన్ రావు కూడా ప్రోత్సహించారు. అప్పటి నుంచి జూమ్ యాప్ ద్వారా పాఠాలు చెప్తున్నాం. టీ షాట్ ద్వారా జరిగే పాఠ్యాంశాలపై కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం.

Next Story

Most Viewed