హుజూరాబాద్‌ బైపోల్.. టీడీపీ అనూహ్య నిర్ణయం

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ లో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అనే విషయంపై కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. పోటీ చేయడం లేదని నిర్ణయించింది. అంతేకాదు ఎవరికీ మద్ధతు ఇచ్చే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పోటీ చేసేందుకు నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు ముందుకు వచ్చినప్పటికీ అందుకు నిరాకరించింది. పోటీ చేసి సత్తాను చాటుతామని భావించిన నేతలకు నిరాశే ఎదురైంది.

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ హుజూరాబాద్ ఎన్నికలపై దృష్టిసారించాయి. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కానీ ఘనత చరిత్ర ఉన్న టీడీపీ మాత్రం వెనుకంజ వేసింది. గత కొంతకాలంగా ఎన్నికల్లో పోటీ అంటేనే జంకిన నేతలు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీకి సై అన్నారు. ఒకరుకాదు… ఇద్దరు కాదు… నలుగురు పోటీచేసేందుకు ముందుకు వచ్చారు. తమ బయోడేటాను పరిశీలించాలని పార్టీ అధిష్టానానికి పంపారు. అంతేకాదు బరిలో ఉంటామని నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో పాటు మీడియా సమావేశాల్లో సైతం వెల్లడించారు. వాటన్నింటికి పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. బరిలో నిలువడం లేదని నిర్ణయించడంతో పాటు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసింది పార్టీ జాతీయ నాయకత్వం. అంతేకాదు గీతదాటొద్దని హుకూం జారీ చేసినట్లు సమాచారం.

2023 ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కొలమానంగా తీసుకోబోతున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యంతో పాటు భరోసాను నిలిపేందుకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ సైతం నిన్నటివరకు అభ్యర్థిని బరిలో నిలపాలని నాయకత్వం భావించింది. కానీ అనూహ్యంగా బరిలో నిలవడం లేదని ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించిన నేతలు భంగపడ్డారు. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. పోటీ చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుదామని అనుకున్నప్పటికీ జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయంతో వెనక్కి తగ్గారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను పార్టీ విశ్లేషించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో 1714 ఓట్లు రాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో టీడీపీ పోటీ చేయలేదు. దుబ్బాకలో సైతం పోటీకి దూరంగా ఉంది. అయితే నాగార్జున సాగర్ లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయినప్పటికీ ఎన్నికల్లో ఆశించిన ఓట్లు సాధించలేకపోయింది. మరో పక్క ఎన్నికలు డబ్బుతో కూడుకున్నవి కావడం, పార్టీ నేతలు ఆ స్థాయిలో ఖర్చుపెట్టేవారు లేకపోవడం, రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా లేకపోవడంతో పార్టీ ఓట్లను కూడా వేయించుకోలేకపోయిందని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొంటున్నారు. దీంతో పార్టీ నుంచి పండ్ ఇచ్చే స్థాయిలో లేకపోవడం, పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సైతం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించలేదు. దీంతో పార్టీ శ్రేణులను సమాయత్వం చేయడంలో కొంత జాప్యం జరిగిందనే చెప్పొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో పోటీ చేస్తే డిపాజిట్ వస్తుందో? రాదో? నని భావించి పోటీ నుంచి తప్పుకున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

హుజూరాబాద్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే అభ్యర్థికోసం నానా తంటాలు పడింది. పోటీ చేయడానికే నేతలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేంచి పోటీ చేయడానికి టీడీపీ నుంచి నాలుగురు పార్టీ నేతలు ముందుకు వచ్చారు. పోటీ చేస్తామని పార్టీ భీఫాం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని అభ్యర్థించారు. పరిశీలించాలని బయోడేటాను పంపారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగే బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. పోటీతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో స్తబ్దంగా ఉన్న పార్టీలో జోష్ వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఇక తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమేనని, పార్టీని నమ్ముకున్న తమ భవిష్యత్ ఏంటనీ లోలోన మధనపడుతున్నారు.

Next Story

Most Viewed