Telangana Cab Drivers : సీఎం కేసీఆర్‌కు లేఖ.. లాక్‌డౌన్‌లో ఆదుకోవాలని వినతి

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana State Taxi And Drivers Joint Action Committee) కోరింది. ఈ మేరకు పలు డిమాండ్లతో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జేఏసీ లేఖను రాసింది. గతేడాది లాక్ డౌన్ నుంచే డ్రైవర్ల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని, కొందరి రేషన్ల కార్డులు కూడా రద్దయ్యాయని అందులో పేర్కొంది. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు రూ.8,500 ఆర్థిక సాయాన్ని అందించాలని లేఖలో కమిటీ కోరింది. కనీసం మూడు నెలల పాటు వెహికిల్ ఫిట్ నెస్, రోడ్ ట్యాక్స్ లను మినహాయించాలని, డిసెంబర్ 31 వరకూ వెహికిల్స్ లోన్స్ మారిటోరియం విధించాలని నాయకులు కోరారు. రద్దయిన డ్రైవర్ల రేషన్ కార్డులను పునరుద్ధరించి, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందే విధంగా చూడాలని లేఖలో కోరారు. ఇప్పటికే పలువురి వాహనాలను ఈఎంఐ చెల్లించలేని కారణంగా కంపెనీలు తీసుకెళ్లిపోయాయని, కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి మరింత మానసిక క్షోభ మిగులుతోందని జేఏసీ ఛైర్మన్ షేఖ్ సలావుద్దీన్ వివరించారు. రాష్ట్రంలోని లక్షల మంది డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశిస్తున్నారు.

Next Story