‘తనిష్క్’ మళ్లీ మళ్లీ అదే తప్పు!

by  |
‘తనిష్క్’ మళ్లీ మళ్లీ అదే తప్పు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవలే ‘తనిష్క్’‌ జ్యువెల్లర్స్ రూపొందించిన ఓ యాడ్ ఎంత వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. చివరకు తనిష్క్ తన తప్పొప్పుకుని ఆ యాడ్‌ను తొలగించాల్సి వచ్చింది. అయితే మరోసారి అదే బాటలో పయనించిన జ్యువెలరీ సంస్థ.. మళ్లీ చేతులు కాల్చుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ‘ఏకత్వం’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఓ యాడ్‌.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండటంతో మరోసారి తనిష్క్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

యాడ్‌లో నీనా గుప్తా, సయాని గుప్తా, అలయ, నిమ్రత్ కౌర్‌తో తనిష్క్ తాజాగా రూపొందించిన యాడ్‌లో.. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏం గుర్తుకొస్తుందో తెలిపారు. యాడ్‌లో భాగంగా.. ఈ దీపావళికి ఆభరణాలు కొనుగోలు చేస్తానని నీనా చెప్పగా, ఈసారి కుటుంబంతో కలిసి వేడుకలు చేసుకుంటానని నిమ్రత్‌ చెప్పింది. కాగా దీపావళి అంటే తనకు మిఠాయిలు, రుచికరమైన భోజనం, స్నేహితులు, కుటుంబమంతా ఒక్కచోట చేరడమే గుర్తుకొస్తుందని అలయ చెప్పుకురాగా, ఈసారి టపాసులు లేకుండానే దీపాల పండుగ చేసుకుంటానని, దివ్వెలు మాత్రమే వెలిగిస్తానని సయానీ గుప్తా చెబుతోంది. అంతర్లీనంగా ‘ఈ దీపావళికి క్రాకర్స్ కాల్చవద్దు’ అనే సందేశమిచ్చేలా ఈ యాడ్‌ను రూపొందించారు. దాంతో నెటిజన్లు తనిష్క్ యాడ్‌పై తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. మరోసారి ‘బాయ్‌కట్ తనిష్క్’ హ్యాష్‌టాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే తనిష్క్ సపోర్ట్ చేస్తోందని.. అసలు దీపావళి ఎలా జరుపుకోవాలో, జరుపుకోవద్దో తనిష్క్ చెప్పడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలను టార్గెట్ చేయడమే పనిగా తనిష్క్ పనిచేస్తుందా? అంటూ విమర్శిస్తున్నారు. క్రాకర్స్ కాలిస్తే మీకేంటి? కాల్చకపోతే మీకేంటి? ఉచిత సలహాలు ఇవ్వడం ఆపాలంటూ మండిపడుతున్నారు.

కాగా సినీ నిర్మాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి కూడా తనిష్క్ ప్రకటనపై ఫైర్ అయ్యారు. ‘ఈ దీపావళికి హిందూ సంప్రదాయాలను, కల్చర్‌ను కిల్ చేసి.. కన్జ్యూమరిజమ్‌ను ప్రమోట్ చేయండి. ఎందుకంటే, ఫొటోషాప్డ్ సెక్యులర్ మోడల్స్.. ఫేక్ స్మైల్స్‌తో, వీఎఫ్ఎక్స్ శరీరాలను రిగ్రెసివ్ ఆభరణాలతో అలంకరించుకుంటే.. అది ఏకత్వానికి దారి తీస్తుందా?’ అని ఆయన ట్వీట్ చేశాడు.

తనిష్క్ రూపొందించిన ఈ యాడ్‌పై విమర్శలతో పాటు మద్దతు కూడా లభిస్తుండటం గమనార్హం. గతంలో ‘ఏకత్వం’తో రూపొందించిన యాడ్ విషయంలోనూ ఇదే జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలో భాగంగానే.. తనిష్క్ యాడ్ రూపొందించిందని, దాన్ని మరోకోణంలో చూడొద్దని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొంతమంది నెటిజన్లు.. ప్రభుత్వం కూడా టపాసులపై నిషేధం విధించింది కదా! అలాంటప్పుడు తనిష్క్ అదే విషయాన్ని ప్రస్తావిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరికీ తమ తమ అభిప్రాయాలుంటాయి. అయితే.. కంపెనీలు ప్రకటనను రూపొందించే సమయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంది. భారతదేశంలో సర్వమత ప్రజలున్నారు. అందుకే వారి మనోభావాలను నొప్పించకుండా, తమ విశ్వాసాలను భంగం పరచకుండా యాడ్స్ రూపొందించాల్సిన ఆశత్యకత ఉంది.


Next Story

Most Viewed