పీఆర్సీ మేమే ఇస్తాం: తలసాని

by  |
పీఆర్సీ మేమే ఇస్తాం: తలసాని
X

దిశ, కంటోన్మెంట్: మూడేళ్లు అధికారంలో ఉంటాం.. ఉద్యోగులకు పదోన్నతులు, పీఆర్‌సీ ఇచ్చేది తామేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చింది ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ రాయల్ లీ ప్యాలెస్‌లో.. కంటోన్మెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల సర్వ సభ్య సమావేశం స్థానిక ఎమ్మెల్యే జి.సాయన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు తాడులేని బొంగరంలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారి మాటలను నమ్మొద్దన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్నా రెడ్డిపై కూడా తలసాని ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగ నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యావంతురాలు, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె అయిన సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌లో 5వేల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయని, 50 మంది ఓటర్లకు ఒక్కో ఇన్‌చార్జీ‌ని నియమిస్తామన్నారు. ఆ 50 మంది టీఆర్ఎస్ బలపరిచిన వాణిదేవికి ఓటు వేసేలా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మతం పేరిట ఓటర్లను తప్పుదోవ పట్టించి బీజేపీ గెలిచారని సాయన్న విమర్శించారు.


Next Story

Most Viewed