చేయూతనివ్వండి.. దేశం సత్తా చాటుతా : శ్రీనిక

by  |
Taekwondo athlete Maddula Srinika
X

దిశ, ఆర్మూర్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా భారత దేశంలో ఎంతో మేధస్సు ఉన్న మేధావులు మరుగున పడిపోతున్నారు. ప్రపంచ క్రీడా పోటీల్లో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు పైసలు, పలుకుబడి లేక గ్రామాల్లో మిగిలిపోతున్నారు. తాజాగా.. ఆర్థిక సమస్యల కారణంగా మరో అద్భుతమైన తైక్వాండో క్రీడాకారిణి మరుగునపడుతోంది. పేదరికం అడ్డుపడినా తన దృఢ సంకల్పంతో పతకాలు సాధిస్తూ.. తెలంగాణ ఖ్యాతిని అన్ని రాష్ట్రాలకు తెలియజేస్తున్న తెలుగు తేజం మద్దుల శ్రీనిక. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలం తొండకూర్ గ్రామానికి చెందిన ఈ చిన్నారి దాతలు చేయూతనిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతానంటోంది.

తొండకూర్ గ్రామానికి చెందిన మద్దుల మురళికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మురళి అర్చరీలో(విలువిద్య)లో మేటి ఆటగాడు. జాతీయ స్థాయిలో 5 బంగారు, నాలుగు రజత పతకాలు, ఒక కాంస్య పథకం పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న మురళి కోరిక ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల కలగానే మిగిలిపోయింది. దీంతో తన కలను కుమార్తె ద్వారా సాధించాలనుకున్నాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడైనా ఒలింపిక్స్‌లో మన దేశం తరపున ఆడిస్తానని గర్వంగా చెపుతున్నాడు.

బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు తన దగ్గర ఉన్న బంగారం, వస్తువులను కుదువ పెట్టి మరీ పాల్గొనేలా చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు నేపాల్ వెళ్ళాలి, అందుకు చాలా ఖర్చు అవుతుంది. దీంతో దాతలు చేయుతనందిస్తే విజయాలు సాధించి, దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకొస్తామని అంటున్నారు.



Next Story