మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు

by  |
మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో రామోజీరావు సహా మాజీ పోలీసు ఐజీ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రిజర్వుబ్యాంకును కూడా పార్టీగా చేర్చాలంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిర్వాహకులకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు లిఖితపూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపి పై నోటీసులు జారీచేసింది.

రిజర్వుబ్యాంకును, మాజీ ఐజీ కృష్ణంరాజును కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించి అందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో గతంలో ఉమ్మడి హైకోర్టు వెలువరించిన తీర్పును ప్రతిని ఆలస్యంగా అందుకున్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి 266 రోజుల పాటు ఆలస్యమైందని, జరిగిన జాప్యానికి మన్నించాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే… రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 2,600 కోట్ల రూపాయలను దాదాపు రెండున్నర లక్షల మంది నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించారని రామోజీరావుపై అభియోగాలు ఉన్నాయి. ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్‌యూఎఫ్) ద్వారా డిపాజిట్ల సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు అప్పట్లో రామోజీరావు వాదనలు వినిపించారు. ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఒక వ్యవస్థ లేదా ఒక కంపెనీ లేదా ఒక ఫోరమ్ లేదా వ్యక్తుల సమూహం కాదని పేర్కొన్నారు. ఆ కారణంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 (ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి అప్పట్లో ఉమ్మడి హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేసులో పార్టీగా చేర్చింది సుప్రీంకోర్టు. హైదరాబాదులోని మొదటి అదనపు నగర మెజిస్ట్రేట్‌కు అప్పట్లో ఫిర్యాదుచేసిన ఉమ్మడి రాష్ట్ర ఐజీ (ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు) కృష్ణంరాజును కూడా ఈ కేసులో పార్టీగా చేర్చడానికి సుప్రీంకోర్టు సమ్మతించింది. ఫిర్యాదు చేసిన అప్పటి ఐజీ కృష్ణంరాజు వాదనలను గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలనుగానీ వినకుండానే ఈ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఉండవల్లి సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రామోజీరావుకు, మార్గదర్శి నిర్వాహకులకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, మాజీ ఐజీ కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసి, వాటికి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed