టెలికాం సంస్థల ఏజీఆర్ కేసు వాయిదా!

by  |
టెలికాం సంస్థల ఏజీఆర్ కేసు వాయిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం సంస్థలు సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల రూపంలో కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇంత మొత్తం చెల్లింపులు ఒకేసారి చెల్లించడం తమ వల్ల కాదని టెలికాం కంపెనీలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఏజీఆర్‌ బకాయిలను 20 ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాల్లో వార్షిక వాయిదాల పద్దతిన చెల్లించేందుకు అనుమతివ్వాలని టెలికమ్యూనికేషన్ విభాగం మార్చి 16న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ విచారణను జూన్ 18కి వాయిదా వేస్తున్నట్టు గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులకు సంబంధించి 5 రోజుల్లోగా అఫిడవిట్‌లను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సహా ఇతర టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని, ఖర్చులకు కూడా తమ వద్ద లేవని కాబట్టి అఫిడవిట్లు ఐదు రోజుల్లోగా దాఖలు చేయలేమని వొడాఫోన్ ఐడియా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం వోడాఫోన్‌ ప్రభుత్వానికి రూ.53 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో చట్టబద్ధమైన బకాయిలు చెల్లించనందుకు వడ్డీలు, జరిమానాలు కలిపి ఉన్నాయి. ఇప్పటివరకు కంపెనీ రూ. 6,900 కోట్లు చెల్లించింది. డెపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ప్రకారం, ఇంకా రూ. 46,100 కోట్లు చెల్లించాలి.

Next Story

Most Viewed