“ఇనాం ” పేరుతో ఇబ్బంది పెడితే.. ఇక మాములుగా ఉండదు : సీఐ

182

దిశ, సత్తుపల్లి టౌన్ : శుభకార్యాలలో ‘ ఇనాం ‘ బహుమతి పేరుతో డబ్బు కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సత్తుపల్లి పట్టణ సీఐ  ఏ. రమాకాంత్  హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ .. ఇటీవల కాలంలో కొంతమంది సహజంగా తమకు భగవంతుడు ఇచ్చిన  శారీరక అసమతౌల్యాన్ని కలిగిన వర్గానికి చెందిన వారు, పశువులతో భిక్షాటన చేసుకునే వర్గాలు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ , దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు  తమ దృష్టికి  వస్తున్నాయి. ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు , గృహప్రవేశాలు , పెళ్లిళ్లు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్‌ను గమనించిన కొంతమంది ఎద్దుతో, ఇతర వేషధారణతో, ఆ ఇంటి వద్ద వాలి పోయి , ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తున్నారు.

వేడుకలు జరుపుకునేవారు వేలకు వేల రూపాయలు ఇచ్చేంతవరకు రకరకాలుగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇంటిల్లిపాది ముందు దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం . అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా శ్మశాన వాటిక వద్దకు చేరిపోయి, దుఃఖంలో ఉన్న వారిని కూడా వదిలిపెట్టకుండా వేలకు వేలు డబ్బులు గుంజు తున్నట్టుగా తెలుస్తోంది . ఇటువంటి వారు వారి జీవన ఉపాధి కోసం ఇతర వృత్తిలో లేక చిన్న చిన్న  కూలి పనులు చేసుకుని జీవించాలి తప్ప ఇతరులపై పడి దౌర్జన్యంగా డబ్బులు సంపాదిస్తూ ఇతరుల శ్రమను దోచుకోవడం అనైతికం. కావున ఇప్పటి నుంచి తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైన బాధితులు వెంటనే డయల్ 100 (టోల్ ఫ్రీ) నెంబర్‌కు , లేదా పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేసి నట్లయితే , ఐదు నిమిషాలలో బాధితుల సమక్షంలోకి దగ్గరలో వున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకొని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ” తెలిపారు.