ప్రకృతితో మమేకమైన ఆ కుడ్యచిత్రాలు అద్భుతం..

by  |
flower
X

దిశ, ఫీచర్స్ : విరబూసే పూల మొక్కలు, అల్లుకుపోయే తీగలతో పాటు అలంకరణ చెట్లను కూడా ఇంట్లో పెంచుకోవడం పరిపాటే. కొన్ని చెట్లు చూడచక్కగా, అందంగా పెరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బ్రెజిలియన్ స్ట్రీట్ ఆర్టిస్ట్ ఫాబియో గోమ్స్ ట్రిండాడే తన వివరణాత్మక చిత్రాలను ఆ చెట్ల కొమ్మలతో కలపడం ద్వారా అద్భుతమైన గ్రాఫిటీ కళాఖండాలను సృష్టిస్తున్నాడు.

వికసించే పూలమొక్కలు, జడల్లా విచ్చుకునే కొమ్మలు పరిశీలించి చూడాలే గానీ అవి ఎంతో అందంగా, ప్రకృతి గీసిన అద్భుతమైన పెయింటింగ్‌లా కనిపిస్తాయి. ట్రిండాడే అలాంటి పూకొమ్మలనే తన కళాకృతికి కాన్వాస్‌గా ఎంచుకుంటాడు. దీంతో అవే ప్రాథమికంగా సగం కళాకృతిని తయారు చేస్తాయి. దానికి తన కళారూపాన్ని అటాచ్ చేస్తూ, పోర్ట్రెయిట్‌ల ముఖాలు వెంట్రుకల భాగాన్ని గ్రాఫిటీతో చిత్రీకరిస్తాడు. ఆ కళాఖండాలను కచ్చితమైన కోణాల నుంచి చూస్తే.. మనిషి, ప్రకృతి మధ్య ఉన్న సహజ బంధాన్ని వివరిస్తాయి.

ట్రిండాడే గత పదేళ్ల నుంచి ఈ కళలో ప్రసిద్ధి పొందాడు. నగరంలో అతడు వేసిన ఎన్నో కళాకృతులు దేశ, విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా, అతడి ఆలోచనకు ఫిదా అయ్యారు. ఫాబియో ట్రిండాడే క్రియేషన్స్ ఇటీవల బ్రెజిలియన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సరిహద్దులు దాటి మిలియన్ల మంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్ నటి వియోలా డేవిస్, టేలర్ పేయిజ్ వంటి ప్రముఖులతో సహా మరెంతోమంది సెలబ్రిటీలు కూడా ఫాబియోకు అభిమానులుగా మారిపోయారు.

‘నా కళకు పాజిటివ్ రివ్యూస్ రావడం నిజంగా సంతోషంగా ఉంది. నేను చేయాలనుకున్నది చేస్తూ జీవించడానికి ఇది నాకు స్ఫూర్తినిస్తుంది’ అని పాభియో తెలిపాడు.



Next Story