ఘనంగా గాడిదల వివాహం.. భారీగా హాజరైన ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాకే(వీడియో)

by  |
ఘనంగా గాడిదల వివాహం.. భారీగా హాజరైన ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాకే(వీడియో)
X

దిశ, ఏపీ బ్యూరో: కంప్యూటర్ యుగంలో కూడా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నేల నుంచి నింగికి ప్రయాణం చేస్తున్న రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలనే విశ్వసిస్తున్నారు ప్రజలు. ఎవరైనా చనిపోతే గ్రామాన్ని ఏదో అరిష్టం పట్టుకుందంటూ అనేక పూజలు..జంతు బలులిస్తున్నారు. అంతేకాదు వర్షాలు కోసం అయితే అనేక వింత ఆచారాలు చేస్తుంటారు మారమూల గ్రామాల ప్రజలు. వరుణుడు కరుణించాలని కోరుతూ యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు డబ్బుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో కొందరు కప్పలకు పెళ్లిళ్లు చేయడం, గ్రామదేవతకు బిందెలతో నీటిని తెచ్చి అభిషేకం చేసి చల్లబర్చడం ఇలా వింత ఆచారాలు పాటిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హోసూరులో వర్షాలు కురవకపోవడంతో గ్రామస్థులు గాడిదలకు పెళ్లి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఘనంగా వాసుదేవ కళ్యాణ మహోత్సవం..

పత్తికొండ మండలం హోసూరులో వర్షాలు కురవక రైతులు గత కొన్నిరోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. మరోవైపు గొంతు తడారిపోతుంది. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకడం కూడా కష్టంగా మారింది. అటు సాగునీరు..ఇటు తాగునీరు లేకపోవడంతో హోసూరు ప్రాంత ప్రజలకు బతుకుబండి లాగడం చాలా కష్టంగా మారింది. దీంతో వరుణుడు కరుణ కోసం గుడిలో పూజలు చేసినా వర్షాలు కురవడం లేదు. అయితే యజ్ఞాలు, యాగాలు చేసే స్థోమత కూడా లేకపోవడంతో ఆ నిరుపేద ప్రజలు ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. వాసుదేవ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వివాహ మహోత్సవంలో భాగంగా గాడిదలకు భక్తి శ్రద్ధలతో వివాహం జరిపించారు. మనుషుల వివాహ తంతు ఎలా అయితే జరిగిందో అలానే ఈ వివాహ తంతును నడిపించారు గ్రామ పెద్దలు. పెళ్లికి ముందు రెండు గాడిదలను గ్రామంలో ఊరేగించారు. అనంతరం రెండు గాడిదల కుటుంబాలకు చెందిన వారు నూతన వస్త్రాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు.. బంధువులు..వేద మంత్రాల సాక్షిగా గాడిదల వివాహం జరిగింది.

గ్రామస్థులు ఏమన్నారంటే!

వాసుదేవ కళ్యాణ మహోత్సవంలో భాగంగా గాడిదలకు పెళ్లిళ్లు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. వరుణుడు కరుణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. ఇది తమ సంప్రదాయమని చెప్పుకొచ్చారు. ధనవంతులు యజ్ఞాలు, యాగాలు చేస్తారని తాము పేదలం కావడంతో వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంతోనైనా వరుణ దేవుడు కరుణిస్తాడన్న నమ్మకం ఉందని గ్రామస్థులు చెప్తున్నారు.



Next Story

Most Viewed