మెట్రోలో శ్రమదోపిడీ

by  |
మెట్రోలో శ్రమదోపిడీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచంలో అగ్రగామి మన మెట్రో. దేశంలోనే అతిపెద్ద రెండో మెట్రో సేవలు మన దగ్గరే ఉన్నాయి. తరచూ మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్పుకునే మాటలు. నగర ప్రతిష్ఠలో కీర్తికిరీటంగా పేర్కొనే హైదరాబాద్ మెట్రోలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళాఉద్యోగులపై ఏజెన్సీ సిబ్బంది వేధింపులు అంతాఇంతా కాదు. జీతం ఇవ్వడం దగ్గర నుంచి డ్యూటీలు కేటాయించడం వరకూ ఎజెన్సీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే ఉన్నపళంగా ఉద్యోగం తీసేస్తున్నామని ప్రకటన. ఇవన్నీ హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు, తెలంగాణ ప్రభుత్వం కండ్లకు కనిపించకపోవడం విచారకరం.
హైదరాబాద్ మెట్రో అత్యంత వేగంగా, హైజెనిక్‌గా ప్రయాణ సేవలందిస్తోందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పలుమార్లు ప్రకటిస్తూ వస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ మెట్రో తమ సిబ్బందితో మెట్రో స్టేషన్లు, ట్రైన్లను రోజూ క్లీన్ చేయిస్తోంది. మెట్రో ప్రతిష్ట, ప్రయాణికుల కోసం కష్టపడుతున్న ఈ సిబ్బందికి ఇప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి. మెట్రోను మూడు స్టేజీలుగా విభజిస్తూ రెండింటిని అప్ డేటర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్(యూడీఎస్) కంపెనీకి అప్పగించారు. 2017లో ఈ కంపెనీ 60 మంది మహిళలతో కలిపి సుమారు వంద మందికి పైగా సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకున్నారు. మెట్రో స్టేషన్లు, టాయిలెట్లను శుభ్రపరచడం వంటి పనులు వీరు చేస్తుంటారు. ఒప్పంద పత్రం ప్రకారం.. రూ.10,304 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు, సెలవులు ఉంటాయని చెప్పారు. అయితే పండగ రోజుల్లో సెలవులు లేకుండా పనిచేయించుకుంటున్నారు. ఉద్యోగంలో చేరిన ఆరు నెలలు వేతం పెంచుతామని అగ్రిమెంట్‌లో పేర్కొన్నా ఇప్పటివరకూ పెంచలేదు. 8 గంటలు పనిచేయించాల్సి ఉండగా 9 గంటలూ కచ్చితంగా చేయించేలా సూపర్‌వైజర్లను నియమించారు. తాజాగా 12 గంటలు పనిచేయాలని కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరికి సంబంధించి రెండు షిప్టుల పనివిధానం ఉండగా.. వీరి పరిధిలోని అన్నిస్టేషన్లలో 12 గంటలు పని చేయాలని నిబంధనలు విధిస్తున్నారు.

మహిళాఉద్యోగులకు తప్పని వేదనలు

కరోనా భయం నేపథ్యంలో మెట్రోలో పరిశుభ్ర చర్యలు అధికమయ్యాయి. రెండేండ్లు దాటినా వేతనం పెంపు లేకపోవడంతో ఎక్కువ మంది పురుష కార్మికులు ఉద్యోగాలకు రావడం లేదు. దీంతో వారి పనిభారం మహిళాకార్మికుల పైనే పడుతోంది. కొన్ని మెట్రో స్టేషన్లలో పురుషుల టాయిలెట్లను సైతం తమతో క్లీన్ చేయించారని కొందరు మహిళా కార్మికులు వాపోతున్నారు. సాధారణంగా మహిళలకు ఉదయం 6 గంటలకు, 10 గంటలకు వచ్చి రాత్రి ఏడు గంటలకు వెళ్లే విధంగా షిప్టులు ఉన్నాయి. అయినా రాత్రి 8 గంటలు దాటుతోంది. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటల వరకూ కచ్చితంగా పనిలో ఉండాలని యూడీఎస్ సంస్థ సూపర్ వైజర్లు ఒత్తిడి తెస్తున్నారు. డ్యూటీ మారేటపుడు పంచ్ చేయడం, డ్రెస్ మార్చుకోవడం వంటి వాటి కోసం అర గంట పడుతుంది. వీటిని డ్యూటీ టైంలో లెక్కించరు. దీంతో రాత్రిళ్లు పది వరకూ మెట్రో స్టేషన్లలోనే ఉంటే తాము ఇంటికి ఎప్పుడూ వెళ్లాలని మహిళా కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబాన్ని నడుపుకునేందుకు డ్యూటీలకు వస్తే 12 గంటలు ఇక్కడే ఉంటే ఇంట్లో పిల్లలు, కుటుంబ వ్యవహారాలు ఎవరు చూస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ తరపున మాట్లాడేవారు లేకపోవడంతోనే యూడీఎస్, మెట్రో సంస్థలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మెట్రో మహిళాకార్మికులు వాపోతున్నారు.
సూపర్ వైజర్లను ఎవరైనా ఈ విషయాలపై ప్రశ్నిస్తే వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నారు. యూడీఎస్ సంస్థ ఉద్యోగులు సైతం మహిళాకార్మికుల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అజామాయిషీ చేస్తున్నారని తెలుస్తోంది. మహిళా కార్మికులపై వేధింపులపై యూడీఎస్ సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మెట్రో ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న హెచ్ఎంఆర్ఎల్ తమ ఉద్యోగాలను నిలబెట్టి ఆదుకోవాలని మహిళా కార్మికులు కోరుతున్నారు.

tags : HMRL, metro, hyderabad, NVs reddy, UDS,Labour,

Next Story

Most Viewed