జాతికి మార్గదర్శి ఏపీజే అబ్దుల్ కలాం

by  |
జాతికి మార్గదర్శి ఏపీజే అబ్దుల్ కలాం
X

చరిత్రలో స్థానం సంపాదించుకున్న మహనీయుల జీవిత విశేషాలను యధావిధిగా చదువుకోవడం మాత్రమే నేటి తరానికి ఉపయోగపడదు. వారి దృక్పథాలు, ధోరణులు, సామాజిక చింతన, నమ్ముకున్న సిద్ధాంతం కోసం చేసిన త్యాగాలు, ప్రజానీకాన్ని ప్రభావితం చేసే రచనలు, వారి జీవితంలో అరుదైన సంఘటనలు మధ్య తరానికి ,నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే వారి జీవిత చరిత్రను చారిత్రక భౌతిక కోణంలో అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే నేటి, రాబోయే తరాలకు అంతరాలు తగ్గించి ఆచరణాత్మక కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదే మనము చరిత్ర నుండి ఆశించే సామాజిక ప్రయోజనం. అబ్దుల్ కలాం ఏరోస్పేస్ సైంటిస్ట్‌గా డీఆర్‌డీఓ, ఐఎస్ఆర్ఓ, మిస్సైల్ మిలిటరీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగస్వామిగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేసుకుని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకోవడం జాతికి గర్వకారణం. 1974 లో నిర్వహించిన మొదటి న్యూక్లియర్ పరీక్షలోనూ, 1998లో జరిగిన పోక్రాన్ అణు పరీక్ష-2 లోను క్రియాశీల పాత్ర పోషించారు. భారత రక్షణ రంగానికి సంబంధించిన మిస్సైల్ విభాగానికి ఆద్యునిగా, రాబోయే శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడిగా నిలవడం చాలా అభినందనీయం. తనకు ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి సామాజిక బాధ్యతగా ఉపయోగిస్తూనే శాస్త్రవేత్తలకు అవగాహన కలిగించడంలో పూర్తిగా సఫలం అయ్యారని , ఇది శాస్త్రవేత్తల స్థాయిలో నిరంతర కృషి సాధనకు దేశ రక్షణకు సంబంధించిన కీలక నిర్ణయాలలో నిరాడంబర రీతిలో ప్రభుత్వాలకు సహకరిస్తుందనడంలో సందేహం లేదు.

బోధన అంటే ప్రీతి

అబ్దుల్ కలాంగారికి ఉన్నత తరగతుల విద్యార్థులకు బోధించడం ఎంత సంతోషమో, చిన్న పిల్లలతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు, యోగక్షేమాలు తెలుసుకోవడంలో కూడా అంతే సరదా. రాష్ట్రపతిగా కొనసాగుతున్నా కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, విద్యార్థులతో ప్రత్యేకంగా గడిపి అభిప్రాయాలను సేకరించి చర్చించడం వారికే చెల్లింది.”కలలు కనండి కలలను నిజం చేసుకోండి” అనే మాటను ప్రస్తావించి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని లక్ష్యసాధన కోసం అలుపెరుగని పోరాటం చేయాలని పిలుపిచ్చి ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రపతిగా పనిచేసిన కాలంలో ఈ ప్రక్రియ వారికి చాలా పేరు తెచ్చింది. విద్యార్థులు ఎదిగిన తర్వాత ఉద్యోగ రంగానికే పరిమితం కాకుండా స్వచ్ఛమైన నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన పాలకులుగా ఈ దేశాన్ని పాలించడానికి ముందుకు రావాలని యువశక్తిని నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తరచుగా చెప్పేవారు. అవును మరి నేటి యువత ఉద్యోగాలకే పరిమితం అయితే రాబోయే కాలంలో చిత్తశుద్ధి గల ప్రభుత్వాలు ఎలా వస్తాయి? కలాం ఉత్తమ అధ్యాపకుడు, ఉత్తమ ఆలోచనాపరుడు, మహా పాఠకుడు, బహు అధ్యయనశీలి, సామాజిక చింతనాపరుడు. అబ్దుల్ కలాం ప్రజా జీవితానికి సంబంధించి తనను ప్రభావితం చేసిన అంశాలపై ఆంగ్లంలో పుస్తకాలు రాసి విద్యార్థి లోకానికి అందించారు. వారు రాసిన పుస్తకాలు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్. ఇవన్నీ కూడా ప్రాంతీయ భాషలలోనికి అనువదించబడి వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా యువతకు తోడ్పడుతున్నాయి.

రామేశ్వరంలో జన్మించి

1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడులోని ధనుష్కోటిలో రామేశ్వరం సమీపాన జన్మించిన అబ్దుల్ కలాం పూర్తి పేరు “అవుల్ పకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం”. ఉన్నత స్థాయికి ఎదిగి భారత రాష్ట్రపతిగా సేవలందించిన వీరు మద్రాసులోని సెంట్ జోసఫ్ కళాశాలలో, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులోనూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యాలయాలలోనూ, ఇంటిపట్టున కూడా గంటల కొద్ది సమయాన్ని భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము అధ్యయనం చేయడానికి ఎక్కువగా గడిపేవారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విపక్షంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్లనే రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాగలిగాడు. అందుకే ప్రజల రాష్ట్రపతి గా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం ఎన్నిక రాజకీయాలకు అతీతంగా జరిగిన మొదటి పరిణామంగా భావించవచ్చు. ఇది సంతోషించదగినదే కాక స్వాగతించదగ్గ ది కూడా. 2002 నుండి 2007 వ సంవత్సరం వరకు రాష్ట్రపతిగా కొనసాగిన అనంతరం తిరిగి తన బోధనా రంగంలోకి ప్రవేశించారు. విద్యార్థులపై వీరి ప్రభావం ఎక్కువ. ఉన్నత ఆలోచనలు, ఆశయాలను ముందుంచుకుని విద్యార్జన కొనసాగించి ఉన్నతులుగా ఎదగాలని వీరితోనే చాలామంది విద్యార్థులు ప్రభావితులయ్యారు. అత్యున్నత “భారతరత్న “పురస్కారంతో పాటు పద్మ విభూషణ్, పద్మభూషణ్ ఇంకా ఎన్నో పురస్కారాలను ప్రశంసలను అందుకున్నప్పటికీ ఇసుమంత కూడా గర్వం లేని మానవతావాది కలాం. వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, వారి పరిశోధన ఫలితాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా, సామాజిక రాజకీయ ఆర్థిక విషయాల పట్ల వారి అవగాహనను స్వీకరించడం ద్వారా వారిని మనం నిరంతరం మనసులో నిలుపుకొందాం. 2015 జూలై 27 వ తేదీన షిల్లాంగ్ పట్టణంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రధాన వక్తగా ప్రసంగిస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. (నేడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి)

వడ్డేపల్లి మల్లేశం
9014206412



Next Story