ప్రభుత్వం ప్రజలకు మరో భారీ షాక్  

by  |
ప్రభుత్వం ప్రజలకు మరో భారీ షాక్  
X

దిశ ప్రతినిధి,నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో భారీ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే అనుమతి లేని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజానీకానికి త్వరలోనే మరో గుదిబండ లాంటి నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ వాల్యూను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కాకుండా బహిరంగ మార్కెట్‌ ధరలో 60 శాతం విలువను పెంచేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముందని రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి.

సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ వాల్యూ..

ఉదాహరణకు..సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ప్రస్తుత రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం.. నాన్ అగ్రికల్చర్ భూములకు గజానికి రూ.500, జనగామ రోడ్డులో కమర్షియల్ ప్లాటుకు గజానికి రూ.2వేలు, జాతీయ రహదారి 65 వెంట కమర్షియల్ ప్లాటుకు గజానికి రూ.4వేలు ఉంది. వాస్తవంగా ప్రస్తుతం పిల్లలమర్రి గ్రామంలో బహిరంగ మార్కెటులో ఏ ప్లాటు ధర చూసినా.. రూ.5వేలకు ఏమాత్రం తగ్గదు. అదే అగ్రికల్చర్ భూముల విషయానికొస్తే.. ఎకరం భూమికి రిజిస్ట్రేషన్ వ్యాల్యూ రూ.3.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.8 లక్షలు ఉంది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే..ఎకరాకు రూ.కోటికి పైగానే పలుకుతోంది. అయితే ఇదే పరిస్థితి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉండదు. ఒకే గ్రామం అయినప్పటికీ సర్వే నంబరు, ప్రాంతాన్ని బట్టి బహిరంగ మార్కెట్‌లో ధర అకాశన్నంటుతోంది. దీని ఆధారంగా ప్రభుత్వం సర్వే నంబర్ల వారీగా బహిరంగ మార్కెటులో ఉన్న ధర ప్రకారం 60 శాతం రిజిస్ట్రేషన్ వాల్యూ నిర్ణయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒక వేళ అది కుదరకపోతే.. ప్రస్తుతం ఉన్న వాల్యూలో 30 నుంచి 100 శాతం ధరలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మార్కెట్ వాల్యూ మేరకు..

వాస్తవానికి చివరగా 2013 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ ధరలను మార్చారు. అప్పటి ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వ్యవసాయ భూముల ధరలను ఖరారు చేసింది. ఇండియన్ స్టాంప్ యాక్టు ప్రకారం.. ప్రతి రెండు రెండేండ్లకోసారి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువను మార్చుకునే వెసులుబాటు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్ ధరలను పలు కారణాలతో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందడం.. తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సీఎం కేసీఆర్ దసరా పండుగకు ముందే రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలని భావించారు. కానీ అనివార్య కారణాల నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారని తెలుస్తోంది. ఇదిలావుంటే.. కొత్త రిజిస్ట్రేషన్ వ్యాల్యూను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మార్కెట్ వాల్యూ అసెస్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ కమిటీలు ప్రాంతాలు, సర్వే నంబర్ల వారీగా బహిరంగ మార్కెట్ వాల్యూను మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ వాల్యూ నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కమిటీల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల వారీగా బహిరంగ మార్కెట్ వ్యాల్యూను సేకరించినట్టు సమాచారం.

భారీగా ఆదాయం..

ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ వాల్యూను అమలు చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. ఎందుకంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌తో పాటు జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కావడం, సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతో ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతున్న యాదాద్రి నిర్మాణంతో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని చాలా మండలాల్లో ఒక్కో ప్లాటు ధర రూ.లక్షలు పలుకుతోంది. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. అలా పెరిగిన రిజిస్ట్రేషన్లు చూసే ప్రభుత్వానికి కొత్త ఆలోచనకు పూనుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

30నుంచి 100శాతం పెంపు?

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఒక్క ఎకరం వ్యవసాయ భూమి సగటున బహిరంగ మార్కెటు ప్రకారం.. రూ.10 లక్షలకు పైనే పలుకుతోంది. ఇది ఇప్పటివరకు ఎకరానికి రిజిస్ట్రేషన్ వాల్యూ రూ.2.50 లక్షలుగానే ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 30 నుంచి 100 శాతం పెంచాలా.. లేక బహిరంగ మార్కెట్ వాల్యూలో 60 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేయాలా అన్న యోచనలో ప్రభుత్వం ఉంది. వాస్తవానికి గతంలో రిజిస్ట్రేషన్ వాల్యూను 2013 ఆగస్టు నెలలో పెంచారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం.. కొత్త జిల్లాలు, మండలాలతో పాటు జనాభా రోజురోజూకీ పెరుగుతుండడంతో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నంబర్లు, గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ హౌజులు, వెంచర్ల వారీగా రిజిస్ట్రేషన్ వాల్యూను నిర్ణయించనున్నట్టు సమాచా రం. అయితే రిజిస్ట్రేషన్ వాల్యూకు సంబంధించిన వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సేకరించి సీఎం కేసీఆర్ వద్దకు పంపినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.



Next Story