కనుల పండువగా రాములోరి కల్యాణం

by  |
కనుల పండువగా రాములోరి కల్యాణం
X

దిశ, భద్రాచలం : రామ క్షేత్రం భద్రగిరి సన్నిధిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతోంది. వేకువజామునే అంతరాలయంలో తొలుత ధ్రువ మూర్తులకు అర్చకస్వాములు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వేంచేయింప జేసీ ప్రత్యేక పూజలు చేశారు.‌ తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం గావించారు. భక్త రామదాసు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తయారు చేయించిన బంగారు ఆభరణాలు అన్ని అలంకరింపచేసి భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు.

శ్రీ సీతారాముల వారి కల్యాణ వైభవాన్ని భక్తులకు అర్చకస్వాములు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శ్రీసీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో మరో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించారు. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం లో అర్చక స్వాములు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పై జీలకర్ర-బెల్లం ఉంచి కళ్యాణం కమనీయంగా జరిపారు. అనంతరం తలంబ్రాలు తంతు నిర్వహించారు. కొద్దిమంది సమక్షంలోనే ఈ కళ్యాణ్ జరిపారు. కోవిడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని దేవస్థానం ఈ కళ్యాణం నిర్వహించింది.

ఈ కళ్యాణ వేడుకలో రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎండోమెంట్ కమీషనర్ అనిల్‌కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దేవస్థానం ఈవో శివాజీ తదితర ప్రముఖులు పాల్గొని కనులారా తిలకిస్తున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి కూడా సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించే భాగ్యం భక్తజనావళికి లేకపోవడంతో టీవీ ముందు కూర్చొని కళ్యాణ ఘట్టం తిలకిస్తున్నారు. ఆలయం వైపు భక్తులు ఎవరు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. కళ్యాణం రోజున భక్తులతో క్రిక్కిరిసి ఉండే ఆలయ పరిసరాల వీథులన్నీ కోవిడ్ ఆంక్షల మూలంగా బోసిపోయి కనిపిస్తున్నాయి.



Next Story

Most Viewed