ధోనీ చెప్పిన మాటలతోనే.. విరాట్ కోహ్లీ

by Disha Web Desk 12 |
ధోనీ చెప్పిన మాటలతోనే.. విరాట్ కోహ్లీ
X

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పై తనకున్న బంధాన్ని మరోసారి బయటపెట్టాడు మాజీ సారథి, కింగ్ కోహ్లీ. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాడ్ కాస్ట్ సీజన్-2‌లో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లేమితో తాను ఇబ్బంది పడిన సమయంలో ధోనీ ఒక్కడే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి అండగా నిలిచాడని, ఆ సమయంలో అతను చెప్పిన మాటలు తనపై బలంగా పనిచేశాయన్నాడు. ‘ప్రస్తుతం నా కెరీర్‌లో ఓ భిన్నమైన దశను అనుభవిస్తున్నా.

కానీ, నేను క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు నా భార్య అనుష్క నాకు వెన్నంటే ఉంది. ఆసక్తికర విషయమేంటంటే.. నా కుటుంబం, చిన్ననాటి కోచ్ కాకుండా నాకు అండగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ధోనీ మాత్రమే. ధోనీ ఇతరను అరుదుగా కలుస్తుంటాడు. నేను కాల్ చేస్తే 99 శాతం అతను లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఫోన్ ఎక్కువగా ఉపయోగించడు. అలాంటి వ్యక్తి నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండు సార్లు మెసేజ్ చేశాడు. నాకు పంపిన మెసేజ్‌లో ‘నువ్వు బలంగా ఉండాలని అనుకున్నప్పుడు, వ్యక్తిగతంగా ధృఢంగా కనిపిస్తే.. ప్రజలు నువ్వు ఏం చేస్తున్నావు? అని అడగరు’ అని పంపించాడు.

ఆ మాటలు నాపై బలంగా పనిచేశాయి. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, మానసికంగా బలంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించేలా కనిపించాలని భావిస్తాను. కానీ, జీవితంలో ఏదొక సమయంలో రెండు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి వస్తుందని మనం గ్రహించాలి. అదే సమయంలో ఉన్నతంగా ఎలా రాణించాలో కూడా అర్థం చేసుకోవాలి. సుదీర్ఘ కాలంలో ఆటలో బలమైన వ్యక్తులుగా ఉన్నప్పుడు ఎదుటివారి బాధను అర్థం చేసుకోగలరు. పరిస్థితులను వారికి అర్థమయ్యేలా వివరించగలరు.

ధోనీ గురించి నేను ఈ విషయాన్ని చెప్పడానికి కారణమిదే. ధోనీ కూడా గతంలో నాలాంటి పరిస్థితిని అనుభవించాడు. కాబట్టే, నా భావోద్వేగాన్ని అతడు అర్థం చేసుకున్నాడు’ అని కోహ్లీ వివరించాడు. కాగా, ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీతో ఫామ్ అందుకున్న కోహ్లీ ఆ తర్వాత కింగ్ కోహ్లీ బ్యాక్ అనేలా ప్రదర్శన చేశాడు. అయితే, టెస్టుల్లో మాత్రం కోహ్లీ సెంచరీ చేయక మూడున్నరేళ్లు అవుతుంది. 2019లో బంగ్లాదేశ్‌పై బాదిన శతకమే చివరిది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులో నిరాశపర్చిన అతను.. మూడో టెస్టులో సత్తా చాటాలని భావిస్తున్నాడు.


Next Story

Most Viewed