చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసిస్‌కు షాక్.. శ్రీలంక చేతిలో వైట్‌వాష్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. శ్రీలంక చేతిలో వరుసగా రెండో వన్డేలో కూడా ఓడిపోయింది.

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసిస్‌కు షాక్.. శ్రీలంక చేతిలో వైట్‌వాష్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. శ్రీలంక చేతిలో వరుసగా రెండో వన్డేలో కూడా ఓడిపోయింది. అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక వన్డే సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 174 పరుగుల తేడాతో ఆసిస్‌ను మట్టికరించింది. వన్డేల్లో ఆసిస్‌పై లంక జట్టుకు ఇదే భారీ విజయం. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. మొదట ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 281 రన్స్ చేసింది. కుసాల్ మెండిస్(101) సెంచరీతో రెచ్చిపోయాడు. అతనికితోడు కెప్టెన్ అసలంక(78) తన ఫామ్‌ను కొనసాగించగా.. నిశాన్ మదుష్కా(51) కూడా సత్తాచాటాడు. ఆ తర్వాత లంక బౌలర్లు ఆసిస్‌ భరతం పట్టారు. లంక బౌలర్లు దునిత్ వెల్లలాగే 4 వికెట్లు, అసిత ఫెర్నాండో, హసరంగ మూడేసి వికెట్లతో చెలరేగి ఆసిస్ పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మిత్(29) టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు లంక బౌలర్లు ముందు ఏ విధంగా తలవంచారో అర్థం చేసుకోవచ్చు. హెడ్(18), జోష్ ఇంగ్లిస్(22), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(9), మాథ్యూ షార్ట్(2), మ్యాక్స్‌వెల్(1) విఫలమయ్యారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంక పర్యటనను ఆసిస్ సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లను కోల్పోయిన ఆ జట్టుకు సిరీస్ కోల్పోవడం కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదే.


Next Story