షోయబ్ రికార్డ్ ను.. ఉమ్రాన్ తుడిచేస్తాడా..!

by Disha Web Desk 1 |
షోయబ్ రికార్డ్ ను.. ఉమ్రాన్ తుడిచేస్తాడా..!
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్ల రికార్డులు, వారి ఉత్తమ ప్రదర్శన గురించి ఎల్లప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇందులో పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ నెలకొల్పిన రికార్డు 20ఏళ్ల నుంచి పదిలంగానే ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన 2003 వన్డే ప్రపంచకప్‌లో షోయబ్ అక్తర్ గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. షోయబ్ అక్తర్ సాధించిన ఈ రికార్డును ఇప్పటికీ ఏ బౌలర్ కూడా అందుకోలేకపోతున్నారు. ప్రపంచ క్రికెట్‌లోని ఫాస్ట్ బౌలర్లలో షోయబ్ అక్తర్ ఎప్పుడూ ముందంజలో ఉంటాడు. అతనితో పాటు ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు చాలా మంది బౌలర్లు కనిపించారు. వారు ఖచ్చితంగా తమ వేగంతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ, ఒక్క షోయబ్ అక్తర్ రికార్డును మాత్రం అందుకోలేక పోయారు. ఇప్పటి వరకు రికార్డును బద్దలు కొట్టేందుకు వచ్చిన ఐదుగురు బౌలర్ల గురించి తెలుసుకుందాం.

1. షాన్ టెయిట్ (161.1): ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ ఆడుతున్న రోజుల్లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అందరూ పరిగణించారు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాన్ టెయిట్ వేసిన ఒక బంతి వేగం గంటకు 161.1 కి.మీ.గా ఉంది. షాన్ టెయిట్ కెరీర్ గురించి చెప్పాలంటే అతను ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేదు. అతను కేవలం 21 టీ20 మ్యాచ్‌లు, మూడు టెస్టు మ్యాచ్‌లు, 35 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

2. బ్రెట్ లీ (161.1): ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మాజీ కంగారూ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ బంతులను ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కు అంత తేలికైన పని కాదు. 2005లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెట్ లీ 161.1 కి.మీ. వేగంతో బంతిని వేశాడు.

3. మిచెల్ స్టార్క్ (160.4): ప్రస్తుతం మిచెల్ స్టార్క్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. అతని బంతుల వేగాన్ని ఎదుర్కోవడం బ్యాట్స్‌మన్‌కి అంత ఈజీ టాస్క్ కాదు. 2015లో పెర్త్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ గంటకు 160.4 కి.మీ. వేగంతో బంతిని వేశాడు.

4. ఫిడేల్ ఎడ్వర్డ్స్ (157.7):వెస్టిండీస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్ కూడా ఉంటాడు. 2003లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫిడేల్ ఎడ్వర్డ్స్ గంటకు 157.7 కి.మీ.వేగంతో బంతిని వేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యంత వేగవంతమైన బంతి.

5. మిచెల్ జాన్సన్ (156.8): ప్రపంచ క్రికెట్‌లో మిచెల్ జాన్సన్ పేస్ స్పష్టంగా కనిపించే విషయం ఇది. 2013లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిషెల్ జాన్సన్ వేసిన ఒక బంతి గంటకు ఏకంగా 156.8 కి.మీ. వేగంతో దూసుకుపోయింది.

ప్రస్తుతం ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లో ముగ్గురే ఉన్నారు. వీరిలో ఒకరు భారత బౌలర్ ఉమ్రాన్ మాలిక్. కెరీర్ ప్రారంభంలోనే ఐపీఎల్‌లో 157 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన ఆన్రిచ్ నోకియా, న్యూజిలాండ్‌కు చెందిన లూకీ ఫెర్గూసన్‌లకు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ఆడుతున్న యువ బౌలర్లలో అత్యంత వేగవంతమైన బౌలర్లు వీరే.

Also Read...

టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయిన కేన్ విలియమ్సన్

Next Story