రిజ్వాన్‌పై 17.5 ఏళ్ల నిషేధం

by Dishanational3 |
రిజ్వాన్‌పై 17.5 ఏళ్ల నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : అబుదాబి టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన బ్రిటన్ క్లబ్ క్రికెటర్ రిజ్వాన్ జావెద్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. 17.5 ఏళ్లపాటు నిషేధం విధించింది. 2021‌లో జరిగిన అబుదాబి టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న 8 మందిలో రిజ్వాన్ కూడా ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెటర్ నాసీర్ హుస్సేన్‌ను రెండేళ్లపాటు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిజ్వాన్ జావెద్‌పై ఐసీసీ వేటు వేసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అవినీతి నిరోధక కోడ్‌లో ఐదు నిబంధనలను రిజ్వాన్ ఉల్లంఘించాడు. మూడు సందర్భాల్లో ఫిక్సింగ్ ప్రయత్నించడం, ఇతరులను ప్రేరేపించడం, ఫిక్సింగ్‌కు సంబంధించి వివరాలను అందజేయకపోవడం, విచారణకు సహకరించకపోవడం వంటి నిబంధనలను అతను ఉల్లంఘించాడు. ఐసీసీ విచారణలో అతను దోషిగా తేలాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయగా.. తాజాగా అతన్ని 17.5 ఏళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. 2041 వరకు అతను ఎలాంటి క్రికెట్ ఆడటానికి లేదు. రిజ్వాన్‌పై కఠిన చర్యలు తీసుకోవడంపై ఐసీసీ జనరల్ మేనేజర్ ఇంటిగ్రిటీ అలెక్స్ మార్షల్ స్పందించాడు. రిజ్వాన్ ప్రొషనల్ క్రికెటర్లను అవినీతికి పాల్పడేలా పలుమార్లు ప్రయత్నించాడని, అందుకే అతను సుదీర్ఘ నిషేధానికి గురయ్యాడని తెలిపాడు. ‘క్రికెట్‌లో అవినీతికి పాల్పడాలనుకునే వారికి ఈ నిర్ణయం బలమైన సందేశం. క్రికెట్‌ను భ్రష్టు పట్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.’ అని తెలిపాడు.



Next Story

Most Viewed