రిషబ్ పంత్ ఢిల్లీ క్యాంప్‌లో అడుగుపెట్టేది అప్పుడే.. అప్‌డేట్ ఇచ్చిన గంగూలీ

by Dishanational3 |
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాంప్‌లో అడుగుపెట్టేది అప్పుడే.. అప్‌డేట్ ఇచ్చిన గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 5న పంత్‌కు ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ఫిట్‌గా ఉండేందుకు అతను అన్ని చేశాడని, అందుకే ఎన్‌సీఏ అతనికి క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు తెలిపాడు. ‘మార్చి 5న రిషబ్ క్లియరెన్స్ పొందనున్నాడు. ఆ తర్వాతే కెప్టెన్సీ బ్యాకప్‌ గురించి చర్చిస్తాం. అతని విషయంలో మేము జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఎందుకుంటే, అతనికి సుదీర్ఘ కెరీర్ ఉంది. మేము అతనిపై ఒత్తిడి పెంచడం లేదు. రిషబ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఎన్‌సీఏ క్లియరెన్స్ తర్వాత అతను ఢిల్లీ క్యాంప్‌లో చేరుతాడు. అతన్ని మ్యాచ్ వారీగా పరిశీలిస్తాం. ఇప్పుడే మేము అంచనా వేయలేం.’ అని చెప్పాడు.

అలాగే, వికెట్ కీపింగ్ గురించి గంగూలీ మాట్లాడుతూ.. తమకు చాలా ఆప్షన్లు ఉన్నాయన్నాడు. ‘కుమార్ కుశాగ్రా ఉన్నాడు. రిక్కీ భుయ్ మంచి సీజన్‌ను కలిగి ఉన్నాడు. షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా అందుబాటులో ఉన్నారు.’ అని చెప్పుకొచ్చాడు. పంత్ తిరిగి రావడం తమకు అదనపు బలమని, అతను సీజన్ మొత్తం ఆడతాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ‘అతను మాకు చాలా స్పెషల్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న కొంత మంది దేశవాళీ ఆటగాళ్లతో మేము పనిచేశాం. కానీ, రిషబ్ మాకు చాలా ముఖ్యమైనవాడు.’ అని దాదా తెలిపాడు.

2022 డిసెంబర్‌లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఆటకు దూరమై ఏడాది దాటి పోయింది. గతేడాది ఐపీఎల్‌తోపాటు జాతీయ జట్టుకు కూడా అందుబాటులో లేడు. గాయాల నుంచి కోలుకున్న అతను ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఇటీవల అతను ఎన్‌సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఐపీఎల్‌తో పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే, సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటంపై అనుమానాలైతే నెలకొన్నాయి. అంతేకాకుండా, రిషబ్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కారు ప్రమాదంలో రెండు మోకాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఇన్నింగ్స్ మొత్తం కీపింగ్ బాధ్యతలు చూసుకోవడం కష్టమవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీపింగ్ బాధ్యతలు మరో ప్లేయర్‌కు అప్పగించి.. పంత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోవాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఢిల్లీ జట్టు ఈ నెల 23న జరిగే తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడటం ద్వారా లీగ్‌ను ప్రారంభించనుంది.


Next Story

Most Viewed