మూడో టెస్టులో నమోదైన రికార్డులు ఇవే..

by Dishanational3 |
మూడో టెస్టులో నమోదైన రికార్డులు ఇవే..
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదిగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు టీమ్ ఇండియా ఆధిపత్యమే కొనసాగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లను కోల్పోయి 326 పరుగులు చేసి భారీ స్కోరుపై కన్నేసింది. అయితే, తొలి రోజు పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో చూద్దాం..

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 4వ భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. మూడో టెస్టులో 131 పరుగులు చేసిన అతను మొత్తంగా 470 మ్యాచ్‌ల్లో 18, 641 పరుగులు చేశాడు. దీంతో గంగూలీ(18,575)ని అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(34,357) టాప్‌లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో కోహ్లీ(26,733), రాహుల్ ద్రవిడ్(24,208) ఉన్నారు.

సిక్స్‌లు కొట్టడంలోనూ రోహిత్ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో రోహిత్(212) రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు కొట్టిన హిట్‌మ్యాన్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీ(211)ని అధిగమించాడు. ఇయాన్ మోర్గాన్(233) అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే, టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో ధోనీ(78)ని వెనక్కినెట్టిన రోహిత్(79) రెండో స్థానానికి చేరుకున్నాడు. సెహ్వాగ్ 90 సిక్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో 3 వేలకుపైగా పరుగులు 250కిపైగా వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 110 పరుగులతో అజేయంగా నిలిచిన అతను 3 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా 3,003 పరుగులు చేయగా.. 280 టెస్టు వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(5,248 రన్స్, 434 వికెట్లు), అశ్విన్(3,271, 499 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరిసిన సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తొలి టెస్టులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అతను హార్దిక్ పాండ్యాతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ 48 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. 2017లో హార్దిక్ పాండ్యా శ్రీలంకపై 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. వీరి కంటే ముందు భారత మాజీ క్రికెటర్ యాదవేనంద్ర సింగ్ 1934లో 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.


Next Story

Most Viewed