అవకాశమిచ్చి ఆదరించండి

by Disha Web Desk 15 |
అవకాశమిచ్చి ఆదరించండి
X

దిశ,పటాన్ చెరు : మెదక్ పార్లమెంటు సభ్యుడిగా తనకు ఒక సారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పటాన్ చెరు నియోజకవర్గ పరిధి అమీన్ పూర్ మున్సిపల్ బీరంగూడ కమాన్ నుంచి బీరంగూడ గుట్ట వరకు మూడు కిలోమీటర్లు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ, పీసీసీ జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిలకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, తన వర్గీయులు ఘన స్వాగతం పలికారు. బీరంగూడ సెంటర్ లో గజమాలతో సత్కరించి, సన్మానించారు.

అనంతరం ప్రచార వాహనంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ బీరంగూడ గుట్ట వరకు రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా మహిళలు బోనాలతో కదం తొక్కగా పార్టీ నాయకులు వాహనాలతో ర్యాలీగా వెంట వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథం నుంచి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా నీలం మధు రోడ్ షోను తిలకించేందుకు బీరంగూడ సెంటర్ కు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీ బిడ్డని తనకు అవకాశం కల్పించిందన్నారు.

తనను మీ ఇంట్లో బిడ్డగా భావించి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టీ యూ సీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు లావణ్య, మున్నాభాయ్, రవీందర్, ఇసుబ్, కమలాకర్, మల్లేష్, అమీన్పూర్ మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కమలం కారు ఒక్కటే : అద్దంకి దయాకర్

మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్​చెరు నియోజకవర్గం బీరంగూడ గుట్ట కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి తొత్తుగా మారిన కేసీఆర్​ కారును వదిలిపెట్టి బస్సు యాత్రను చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కమలం, బీఆర్ఎస్ ఒకటి కాదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే.. బలహీనవర్గాల బిడ్డ అయిన నీలం మదును భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed