ఆసిస్ జట్టు వైఫల్యానికి కారణం ఖవాజా: సంజయ్ మంజ్రేకర్

by Disha Web Desk 1 |
ఆసిస్ జట్టు వైఫల్యానికి కారణం ఖవాజా: సంజయ్ మంజ్రేకర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా వరుసగా ఓటములు మూటకట్టుకుంది. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటింగ్ చూసిన వాళ్లంతా షాకైపోయారు. ఇంత దారుణంగా ఆ జట్టు ఆడటం ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆసీస్ మాజీ దిగ్గజాలు కూడా ఆ జట్టు ఆటతీరుపై మండిపడ్డారు. అయితే దీనంతటికీ కారణం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజానే అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

స్వీప్ షాట్లే కొంపముంచాయి..

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజా అద్భుతంగా ఆడాడు. నాగ్‌పూర్ టెస్టులో 1, 5 స్కోర్లు నమోదు చేసిన అతను రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మంజ్రేకర్ కూడా గుర్తుచేశాడు. 'మోడ్రన్ క్రికెట్‌లో ఉన్న స్వీప్ షాట్లు అన్నింటినీ తన ఇన్నింగ్స్‌లో ఖవాజా ఆడాడు. నాగ్ పూర్ టెస్టులో ఘోరంగా ఫెయిలైనా.. ఢిల్లీలో అదరగొట్టాడు. దీని వల్లనే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా దెబ్బతింది. ఖవాజా బ్యాటింగ్ చూసిన మిగతా వాళ్లు తాము కూడా రాణించాలంటే స్వీప్ షాట్ ఆడాలని డిసైడ్ అయిపోయినట్లు కనిపించింది' అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

స్టీవ్ స్మిత్ ఔటైన విధానం బాధించింది

ఎగ్రెసివ్‌గా ఆడాలని, దీని కోసం స్వీప్ షాట్‌ను ఆయుధంగా మార్చుకోవాలని ఆసీస్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నట్లు కనిపించిందన్నాడు. అదే సమయంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అవుటైన విధానం చూస్తే చాలా బాధేసిందన్నాడు. 'అశ్విన్ బౌలింగ్‌లో తను సామాన్యంగా ఆడని స్వీప్ ఆడబోయి స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇది చూస్తే చాలా బాధగా అనిపించిందని తెలిపాడు. 2017లో పూణేలో జరిగిన టెస్టులో అతను బాదిన సెంచరీ భారత గడ్డపై విదేశీ ప్లేయర్లు చేసిన అద్భుతమైన సెంచరీల్లో ఒకటి. అలాంటి ఆటగాడేనా ఇలా ఆడింది? అనిపించిందని సంజయ్ చెప్పుకొచ్చాడు.



Next Story