ఇండియా vs పాకిస్తాన్ టికెట్లు ఇంకా అన్‌సోల్డ్.. మ్యాచ్‌పై ఫ్యాన్స్ గుస్సా!

by Phanindra |

ఇండియా vs పాకిస్తాన్ టికెట్లు ఇంకా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాయి. ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

ఇండియా vs పాకిస్తాన్ టికెట్లు ఇంకా అన్‌సోల్డ్.. మ్యాచ్‌పై ఫ్యాన్స్ గుస్సా!
X

దిశ, స్పోర్ట్స్: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే ఆ హైప్ మామూలుగా ఉండదు. ఎన్ని టికెట్లు ఉన్నా గంటల వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయేవి. కానీ దుబాయ్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ మ్యాచ్‌లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. రేపే భారత్, పాక్ మ్యాచ్ జరగబోతుంటే.. దుబాయ్ స్టేడియంలో దాదాపు సగం స్టాండ్స్‌లో టికెట్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఫ్యాన్స్‌లో ఈ మ్యాచ్‌పై హైప్ కంటే పాక్‌తో ఆడుతున్నందుకు కోపమే ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా అంతా బీసీసీఐని తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్ ఆడుతున్నందుకు టీమిండియా ఆడే మిగతా మ్యాచులు కూడా బాయ్‌కాట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆసియా కప్‌పై ఈ బాయ్‌కాట్ ప్రభావం బాగానే ఉందనిపిస్తోంది.

ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్ స్టేడియంలో 25 వేల సీట్లుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈ రెండు టీమ్స్ ఇక్కడే తలపడ్డాయి. ఆ మ్యాచ్ టికెట్స్ అన్నీ కేవలం 4 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆగస్టు 29న టికెట్స్ అమ్మకాలు మొదలైనా.. ఇప్పటి వరకు ఇంకా మొత్తం అమ్ముడుపోలేదు. పదిరోజులపైగా సమయం గడిచినా స్టేడియంలో ఇంకా సగంపైగా టికెట్లు మిగిలిపోయే ఉన్నాయి. దీంతో నిర్వాహకులే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పరిణామం ఊహించిందేనని చెప్పాలి. ఎందుకంటే ఆసియా కప్ మ్యాచుల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే.. పాక్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని రాజకీయ నాయకుల నుంచి ఫ్యాన్స్ వరకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పహెల్గాం వంటి ఉగ్రదాడులు చేయిస్తున్న పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు ఎందుకుండాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభావమే టికెట్ అమ్మకాలపై పడినట్లు కనిపిస్తోంది.

తక్కువ ధర టికెట్లే ఫుల్..

ఈ క్రమంలోనే మ్యాచ్ టికెట్లు కొనేందుకు కూడా ఫ్యాన్స్ ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా 100 (సుమారు రూ.88 వేలు) డాలర్ల నుంచి 4,534 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) వరకు ధర పలికే ఈ టికెట్లు మాత్రమే మిగిలిపోయాయి. అయితే 13 డాలర్లు ధర పలికే టికెట్లు మాత్రం అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలా భారత్, పాక్ మ్యాచ్ టికెట్లు మిగిలిపోవడం షాకింగ్ విషయమే అయినా.. మ్యాచ్ నాటికి మొత్తం అమ్ముడుపోతాయని ఆశిస్తున్నట్లు వాళ్లు చెప్పారు.

ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం..

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ మ్యాచ్‌ ఆడుతున్నందుకు బీసీసీఐపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాము కేవలం ప్రభుత్వ స్టాన్స్‌నే అనుసరిస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. ‘మేం పాకిస్తాన్‌తో ప్రత్యేకంగా ఆడబోం. కానీ ఏసీసీ లేదా ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే ఆడతాం. ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. మేం దాన్నే అనుసరిస్తున్నాం’ అని ఆయన తేల్చిచెప్పారు.

Next Story