బ్రేకింగ్: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: పోరాడి ఓడిన భారత్.. సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడవ వన్డేలో ఆసీస్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 49 ఓవర్లలో ఆలౌట్ అయిన ఆసీస్ 269 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ 47, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33, డేవిడ్ వార్నర్ 23, లబుషేన్ 28, ఆలెక్స్ క్యారీ 38, స్టోయినిస్ 25, బౌలర్ సీన్ అబాట్ 26 పరుగులు చేయడంతో పోరాడే స్కోర్ చేసింది.

కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్కిప్పర్ స్మిత్ తీవ్ర నిరాశ పర్చాడు. కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న స్మిత్ హర్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక, భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదక్ చెరో మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 270 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. ఇక టీమిండియా ఓపెనర్లు రోహిత్ 30, శుభమన్ గిల్ 37 పరుగులతో సరైన శుభారంభం అందించారు.

కెప్టెన్ రోహిత్ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 54 పరుగులతో రాణించాడు. కేఎల్ రాహుల్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. రెండు వన్డేల్లో డకౌట్ అయిన సూర్య కుమార్ యాదవ్ మూడవ వన్డేలో సైతం డకౌట్ అయ్యి తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆల్ రౌండర్స్ హార్ధిక్ పాండ్యా 40, జడేజా 18 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వీరు ఔట్ కావడంతో ఇండియా ఓటమి దిశగా పయనించింది. చివర్లో షమీ ఒక ఫోర్, సిక్స్‌ బాది 14 పరుగులతో పోరాడినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో సత్తా చాటగా.. ఆస్టన్ అగర్ 2 వికెట్లు.. అబాట్, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.

Next Story

Most Viewed