కింగ్ కోహ్లీ చరిత్ర.. తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు

by Dishanational5 |
కింగ్ కోహ్లీ చరిత్ర.. తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు
X

దిశ, స్పోర్ట్స్: పరుగుల రారాజు, కింగ్ కోహ్లీని ఐసీసీ అవార్డు వరించింది. 2023లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విరాట్ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు. కోహ్లీ ఈ అవార్డు సాధించినట్టు గురువారం ఐసీసీ వెల్లడించింది. ఈ అవార్డు కోసం యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తోపాటు స్టార్ పేసర్ మహ్మద్ షమీ పోటీ పడ్డారు. న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ కూడా పోటీలో ఉన్నాడు. వీరిని అధిగమించిన విరాట్ 2023 సంవత్సరానికి గానూ మేటి వన్డే క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీకి ఇది నాలుగో అవార్డు. గతంలో 2012లో తొలిసారిగా అవార్డు గెలుచుకున్న అతను.. 2017, 2018ల్లో వరుసగా అవార్డు సాధించాడు. ఆరేళ్ల తర్వాత కోహ్లీ నాలుగోసారి అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో విరాట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధికసార్లు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(3 సార్లు)తో సమంగా ఉన్న విరాట్ తాజాగా అతన్ని అధిగమించాడు.

కాగా, గతేడాది వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 27 మ్యాచ్‌ల్లో 72.47 సగటుతో 1,377 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. 11 ఇన్నింగ్స్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో హయ్యెస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అంతేకాకుండా, సెమీస్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ కొట్టడం ద్వారా కోహ్లీ 50వ వన్డే శతకాన్ని పూర్తి చేసి.. వన్డే ఫార్మాట్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు.



Next Story

Most Viewed