రోహిత్ రాయుడు అజేయ సెంచరీ.. హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం

by Dishanational3 |
రోహిత్ రాయుడు అజేయ సెంచరీ.. హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేట్ గ్రూపులో మేఘాలయతో జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హైదరాబాద్ కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 182/4‌తో శనివారం ఆట కొనసాగించిన హైదరాబాద్ 346/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి రోజు క్రీజులో పాతుకపోయిన రోహిత్ రాయుడు(124 నాటౌట్) రెండో రోజు సెంచరీ పూర్తి చేశాడు. 216 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మిలింద్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రాయుడు, మిలింద్ జోడీ అజేయంగా 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దక్కింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 111 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌కు 235 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారీ లోటుతో రెండో రోజే రెండో ఇన్నింగ్స్‌కు దిగిన మేఘాలయ మరో సారి హైదరాబాద్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. జస్కీరత్ సింగ్(53), కెప్టెన్ కిషన్ లింగ్డో(47) రాణించగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితవ్వగా.. ఇద్దరు ఖాతా కూడా తెరవలేదు. దీంతో 36.1 ఓవర్లలో మేఘాలయ 154 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు, మిలింద్, రవితేజ రెండేసి వికెట్లతో సత్తాచాటారు.

ఆంధ్ర జట్టు 98/3

ఎలైట్ గ్రూపు-బిలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయి 98 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు వెనుకబడి ఉన్నది. హనుమ విహారి(6), షేక్ రషీద్(3) నిరాశపర్చగా.. ఓపెనర్ జ్ఞానేశ్వర్(23) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ప్రశాంత్ కుమార్(59 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించగా.. అతనితోపాటు రిక్కీ భుయ్(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగుల భారీ స్కోరు చేసింది. తనుష్(54), మోహిత్(53) అర్ధ సెంచరీతో మెరిశారు. ఆంధ్ర బౌలర్లలో నితీశ్ రెడ్డి ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తాచాటాడు.



Next Story

Most Viewed