అమిత్, సచిన్‌లకు స్వర్ణం.. నిఖత్‌కు రజతం

by Dishanational3 |
అమిత్, సచిన్‌లకు స్వర్ణం.. నిఖత్‌కు రజతం
X

దిశ, స్పోర్ట్స్ : బల్గేరియాలో జరుగుతున్న 75వ స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు అమిత్ పంఘల్, సచిన్ సివాచ్ స్వర్ణ పతకాలు సాధించారు. వివిధ కేటగిరీల్లో ఆదివారం ఫైనల్స్ జరిగాయి. 51 కేజీల కేటగిరీ ఫైనల్‌లో అమిత్ 5-0 తేడాతో కజకిస్తాన్‌ బాక్సర్ సంజార్ తాష్కెన్‌బేను చిత్తు చేశాడు. అలాగే, 57 కేజీల కేటగిరీ ఫైనల్‌లో సచిన్ 5-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షఖ్జోద్ ముజఫరోవ్‌ను ఓడించాడు. ఇక, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్(50 కేజీలు) ఈ టోర్నీ రజతంతో సరిపెట్టింది. ఫైనల్‌లో నిఖత్ 2-3 తేడాతో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ సబీనా బోబోకులోవా చేతిలో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో నిఖత్ పోరాడినప్పటికీ మెజార్జీ జడ్జీల మద్దతు పొందలేకపోయింది. మరో బాక్సర్ అరుంధతి చౌదరి 66 కేజీల ఫైనల్ బౌట్‌లో 1-4 తేడాతో వరల్డ్ చాంపియన్ లియు యాంగ్(చైనా) చేతిలో ఓడి రజతం గెలుచుకుంది. అలాగే, బారున్ సింగ్(48 కేజీలు), రజత్(67 కేజీలు) కూడా ఫైనల్‌లో ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టారు. మొత్తంగా ఈ టోర్నీని భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలతో ముగించింది.


Next Story

Most Viewed