దూకుడే కొంపముంచింది: ఇంగ్లాండ్ కెప్టెన్‌పై బీసీసీఐ ప్రెసిడెంట్ విమర్శలు

by Dishanational5 |
దూకుడే కొంపముంచింది: ఇంగ్లాండ్ కెప్టెన్‌పై బీసీసీఐ ప్రెసిడెంట్ విమర్శలు
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు దారుణంగా విఫలమవడానికి ఆ జట్టు దూకుడైన ఆటతీరే కారణమని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బెన్ స్టోక్స్ అగ్రెసివ్ కెప్టెన్సీ వల్లే గత కొన్ని టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోతూ వస్తోందని తెలిపారు. తమ బజ్‌బాల్ వ్యూహంతో ప్రతి మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడేందుకే ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. జట్టు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు అదే పద్ధతిని అనుసరిస్తున్నారు తప్ప.. భారీ స్కోరు చేసే ప్రయత్నం మాత్రం చేయడం లేదని విమర్శించారు. కానీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఎంతో సహనంతో అవకాశం కోసం ఎదురుచూస్తూ, అది రాగానే ఒడిసిపడుతున్నాడని ప్రశంసించారు. ‘‘రోహిత్ శర్మ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఆటలో ఎప్పుడు ఏం చేయాలో రోహిత్‌కు స్పష్టంగా తెలుసు. అతనికి కావాల్సింది బౌలర్ల దగ్గర నుంచి విజయవంతంగా రాబట్టుకోగలుగుతున్నాడు’’ అని రోజర్ బిన్నీ తెలిపారు. తొలి టెస్టులో బజ్‌బాల్ ఆటతీరుతో విజయం సాధించిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత మ్యాచ్‌ల్లోనూ అదే రిపీట్ చేయాలని చూస్తోందని అన్నారు. కానీ, పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదని చెప్పారు. ఇదే సమయంలో తొలి టెస్టులో ఓటమి పాఠంతో రోహిత్ అవకాశాల కోసం సహనంగా ఎదురుచూస్తున్నాడని తెలిపారు. ఆ సహనంతోనే తర్వాతి మూడు టెస్టుల్లో విజయం సాధించాడని వెల్లడించారు. కాగా, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదో టెస్టు మ్యాచ్ ధర్మశాలలో గురువారం నుంచి ప్రారంభమవగా, తొలి రోజు భారత జట్టే ఆధిపత్యం కనబర్చింది.



Next Story