‘ఆస్ట్రేలియన్ ఓపెన్’ మహారాణిగా మళ్లీ సబలెంకనే..

by Dishanational5 |
‘ఆస్ట్రేలియన్ ఓపెన్’ మహారాణిగా మళ్లీ సబలెంకనే..
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వీన్ మళ్లీ సబలెంకనే. ఈ బెలారస్ క్రీడాకారిణి వరుసగా రెండోసారి ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఎగరేసుకపోయింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సబలెంక 6-3, 6-2 తేడాతో చైనా క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్‌ను మట్టికరిపించింది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన వరల్డ్ నం.2 సబలెంక టోర్నీలో ఏకపక్ష విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఫైనల్‌లోనూ ఆమె అదే జోరు కనబరిచింది. వరుస సెట్లలో చైనా ప్రత్యర్థిని చిత్తు చేసింది. కేవలం గంటా 16 నిమిషాల్లోనే మ్యాచ్‌ను దక్కించుకుంది.





తొలి సెట్ నుంచే సబలెంక హవా ప్రదర్శించింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు 3-0తో ఆధిక్యంలోకి వెళ్లి ఆరంభంలోనే సెట్‌పై పట్టు సాధించింది. ఆ తర్వాత కిన్వెన్ సర్వీస్‌ను కాపాడుకుని 5-3తో పోటీలోకి వచ్చింది. అయితే, 9వ గేమ్‌ నెగ్గడంతో సబలెంక తొలి సెట్‌ను సాధించింది. రెండో సెట్‌లో ఆమె మరింత దూకుడు పెంచింది. తొలి గేమ్‌లోనే బ్రేక్ పాయింట్ పొందింది. అనంతరం 5వ గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు వరుసగా మూడు గేమ్‌లను నెగ్గి 5-1తో లీడ్ సాధించింది. ఇక, 8వ గేమ్‌లో చాంపియన్‌షిప్ పాయింట్ సాధించి విజేతగా నిలిచింది. కిన్వెన్ 6 డబుల్ ఫౌల్ట్స్, 16 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. దీంతో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఆమెకు నిరాశ తప్పలేదు.




టోర్నీలో సబలెంక ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకూ అన్ని మ్యాచ్‌లను ఆమె రెండు సెట్లలోనే ముగించింది. ఆడిన 14 సెట్లలోనూ నెగ్గింది. అంతేకాకుండా, 2013 తర్వాత వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి సబలెంకనే. చివరిసారిగా బెలారస్‌కే చెందిన విక్టోరియా అజరెంకా 2012, 2013 ఎడిషన్లలో చాంపియన్‌గా నిలిచింది.




Next Story