స్పెషల్ అట్రాక్షన్‌గా హిల్ స్టేషన్స్.. పర్యాటకులను ఇంప్రెస్ చేస్తున్న కొత్త అందాలు

by  |
స్పెషల్ అట్రాక్షన్‌గా హిల్ స్టేషన్స్.. పర్యాటకులను ఇంప్రెస్ చేస్తున్న కొత్త అందాలు
X

దిశ, ఫీచర్స్ : హోరు గాలులు జోరులో.. పచ్చని లోయల సాక్షిగా ప్రకృతి ఒడిలో సాగే ప్రయాణం ఓ ఆహ్లాదం. నిలువెత్తు చెట్ల మధ్యన నిండుగా ముస్తాబైన పుడమి అందాల వీక్షణం కడు రమణీయం. జలపాతాల సయ్యాటలకు పురివిప్పి ఆడే నెమళ్ల ఆనందాలు, కొండలపై కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే గిరిజన సంప్రదాయాలు.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. కాఫీ తోటల పరిమళాలు, చేతికందే మేఘ మాళికలు, కూని రాగాలకు స్వరం కలిపే పక్షుల కిలకిలలు.. ఎటు చూసినా సహజ అందాల సమాహారమే. ఇక చినుకు తడిలో మురిసిన నేల, పచ్చని చిగుళ్లు తొడిగి ముసిముసిగా నవ్వుతున్న వేళ.. అల్లంత దూరాన, అంతెత్తునున్న హిల్ స్టేషన్స్ చూస్తుంటే పొందే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమంటే నమ్మాల్సిందే. భారత్‌లో అలాంటి ప్రత్యేకతలున్న కొన్ని ‘హిల్‌స్టేషన్స్’ గురించి మీ కోసం..

చిక్‌మంగళూర్ : కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలోని ముల్లయనగిరి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ‘చిక్ మంగళూర్’ హిల్ స్టేషన్ ఉంది. లోయలు, విశాలమైన కొండలు, కాఫీ పువ్వులకు నిలయమైన ఈ పట్టణం కర్ణాటకలో కాఫీ జిల్లాగా ప్రసిద్ధి చెందింది. కాఫీ రుచులను ఆస్వాదిస్తూ ప్రకృతి సుందర దృశ్యాలను వీక్షించడాన్ని ప్రత్యేకమైన అనుభూతిగా చెప్పొచ్చు. దేశంలోనే కాఫీ గింజలను అత్యధికంగా ఉత్పత్తి చేసే చిక్‌మంగళూర్‌లో ఎటూ చూసినా కాఫీ తోటలే దర్శనమిస్తాయి. చాలా వరకు సందర్శకులను తోటల గుండా గైడెడ్ టూర్లకు అనుమతించడమే కాకుండా, వారికి ఎస్టేట్స్‌లోనే ‘హోమ్-స్టే’ కూడా అందిస్తారు. కాఫీ పండించే విధానంతో పాటు దాని చరిత్రను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముల్లయ్యగిరి ట్రెక్, కెమ్మనగుండి, బాబా బుడన్ గిరి ట్రెక్ వంటి అనేక అద్భుతమైన ట్రెక్కింగ్ ట్రయల్స్‌కు ఇది ప్రసిద్ది. ముల్లయనగిరి కర్ణాటకలో ఎత్తయిన శిఖరం కాగా పర్వతాల మీద నుంచి సూర్యుడు ఉదయించే దృశ్యాన్ని చూడటం ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌గా సందర్శకులు భావిస్తారు. ఇక సాహసాలను ఇష్టపడే వారికి ‘భద్రగిరి రాఫ్టింగ్’ ఓ స్పెషల్ అట్రాక్షన్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కుద్రే ముఖ్ జాతీయ పార్క్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిక్ మంగళూరులోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇది ప్రముఖమైనది.

మహాబలేశ్వర్, లోనావాలా : మహారాష్ట్ర

మహారాష్ట్ర, సతారా జిల్లాలోని పశ్చిమ కనుమల్లో సముద్రమట్టానికి 1372 మీటర్లు ఎత్తులో ఈ హిల్ స్టేషన్ ఉంటుంది. అనేక నదులు, అద్భుతమైన క్యాస్కేడ్‌లు, ఆకాశాన్ని తాకే శిఖరాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు బ్రిటిష్ వారి వేసవి రాజధానిగా ఉండే మహాబలేశ్వర్ హిల్ స్టేషన్.. పురాతన దేవాలయాలకు ఆలవాలంగా ఉంది. దట్టమైన అడవులు, జాలువారే జలపాతాలు, కొండలు, లోయలు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. కృష్ణా నది ఇక్కడే ఉద్భవించినందున మహాబలేశ్వర్ హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రంగానూ విలసిల్లుతోంది.

లోనావాలా

పుణె, ముంబైకి దగ్గరగా ఉన్న పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి శ్రేణిలో ఉన్న లోనావాలా మహారాష్ట్రలో అత్యధికులు సందర్శించే హిల్ స్టేషన్. దీని చుట్టూ అనేక జలపాతాలు, సరస్సులు, కొండలు ఉన్నాయి. ఇది క్యాంపింగ్, ట్రెక్కింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. సముద్ర మట్టానికి 624 మీటర్ల ఎత్తులో ఉన్న జంట హిల్ స్టేషన్లలో లోనావాలా ఒకటైతే, ఖండాలా మరొకటి. భాజా గుహలు, బుషి ఆనకట్ట, కర్లా గుహలు, రాజమాచి కోట, రైవుడ్ సరస్సులు లోనావాలాలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలుగా ఉండగా, అద్భుతమైన శిల్పాలతో.. పురాతన బెడ్సా గుహలు ఖండాలాకు పేరు తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ ఉండే డ్యూక్స్‌ ముక్కు.. సందర్శకుల సెల్ఫీ పాయింట్‌గా పేరుపొందింది. వర్షాకాలంలో ఈ రెండు హిల్ స్టేషన్స్ ముంబైకర్స్‌తో పాటు, ప్రపంచవ్యాప్త పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది.

కసోల్ : హిమాచల్‌ప్రదేశ్

పార్వతి నది ఒడ్డున గల చిన్న గ్రామమే కసోల్. దీన్ని ‘ఆమ్‌‌స్టర్‌డామ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ట్రెక్కింగ్ చేసే బ్యాక్‌ప్యాకర్స్‌కు, ప్రకృతి ప్రేమికులకు ప్రసిద్ధ కేంద్రంగా ఖ్యాతి పొందింది. మంచుదుప్పట్లు కప్పుకున్న పర్వతాలు, ఆకాశమే హద్దుగా పెరిగిన పైన్ చెట్లు, గర్జింగ్ నదీ ప్రవాహం వెరసి కసోల్‌ పర్యటనను మనసు హత్తుకునే పర్యాటకంగా మారుస్తాయి. కసోల్‌లోని ఖోర్‌గంగా, యాంకర్ పాస్, సార్ పాస్, పిన్ పర్బతి పాస్‌లు.. ట్రెక్కింగ్ ట్రైల్స్‌కు ప్రసిద్ధి చెందాయి. కసోల్‌కు సమీపంలో ఉన్న ‘మలానా’ కు గ్రామ ప్రజలు స్వయం నిర్బంధంగా ఉండటం కాస్త ఆశ్చర్యపరిచే విషయం. ఆర్యన్ వారసులమని చెప్పుకునే ఈ గ్రామవాసులు, దాని ఫలితంగానే బయటి వ్యక్తులతో పరస్పర చర్యను నివారించారు. ఈ గ్రామం సుందరమైన, సహజ ప్రకృతి దృశ్యాలకు నిలయం కాగా, దీన్ని ‘లిటిల్ గ్రీస్’గా అభివర్ణిస్తారు. ఇజ్రాయెల్‌కు చెందిన అనేకమంది ప్రజలు ఇక్కడ నివసిస్తుండగా, ఆ దేశ వంటకాలను ఇక్కడ రుచి చూడొచ్చు. అంతేకాదు హిబ్రూలో చెక్కబడిన వీధి సంకేతాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి.

పచ్‌మర్హి, మధ్యప్రదేశ్

‘సత్పురా కి రాణి’ అని కూడా పిలిచే ఈ హిల్ స్టేషన్.. సత్పురా పర్వతశ్రేణిలో ఉంది. సాహసికులకు ఇది ఇష్టమైన ప్రదేశం. మోటో పారాసైలింగ్, జిప్-లైనింగ్, వాటర్‌ఫాల్ ట్రెక్కింగ్, జీప్ సఫారీ వంటి ఎన్నో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆస్వాదించొచ్చు. అప్సర విహార్ జలపాతాలు, సత్పురా నేషనల్ పార్క్ చూడదగిన ప్రదేశాలు. తమ ప్రవాస సమయంలో పాండవులు పచ్‌మర్హిలో కొండపై నివసించారని స్థానికులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే కొండపై ఉన్న ఐదు ఇసుకరాయి కోత గుహలను ‘పాండవ’ కేవ్స్‌గా పిలుస్తారు. 1,067 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన పట్టణం యునెస్కో బయోస్పియర్ రిజర్వ్‌లో భాగం కాగా చిరుతలు, అడవిదున్నల(బైసన్)కు ఇది నిలయం.

ఆలి : ఉత్తరాఖండ్

ఆపిల్ తోటలు, ఓక్స్, పైన్ చెట్లతో నిండిన ‘ఆలి’ సహజ సౌందర్యంతో మనల్ని చుట్టుముట్టడమే కాకుండా అనిర్వచనీయమైన అనుభూతలను అందిస్తుంది. ఆలి భారతదేశంలో ప్రసిద్ధ స్కీయింగ్ గమ్యస్థానంగా ఉండగా, గర్హ్‌వల్ మంచుకొండలు అనేక ట్రెక్కింగ్ స్టేషన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇక్కడ మంచు పరుచుకున్న పర్వతాల అద్భుత దృశ్యాలు మనల్ని కట్టిపడేస్తాయి. సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం అనేక మతపరమైన గమ్యస్థానాలకు కూడా ప్రసిద్ధి. శంకరాచార్యుడు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించాడనేది స్థానికుల మాట.

కొన్ని హిల్ స్టేషన్స్

మనాలి, షిమ్లా, డల్హౌజి, స్పిటి, ఖజ్జియార్, ధర్మశాల, కసౌలి, పాలంపుర్, కుఫ్రి, బిర్- హిమాచల్ ప్రదేశ్, ఊటి, కొడైకెనాల్, ఎర్కోడ్, యెలగిరి, కూనూర్ – తమిళనాడు, డార్జిలింగ్, కలింపాంగ్ – వెస్ట్‌బెంగాల్, లేహ్, లడఖ్, శ్రీనగర్, గుల్‌మర్గ్ – జమ్ము అండ్ కశ్మీర్, ముస్సోరి, నైనిటాల్, రిషికేష్ – ఉత్తరాఖండ్, గ్యాంగ్‌టక్ – సిక్కిం, మున్నార్, వాయ్‌నాడ్, ఇడుక్కి – కేరళ, కూర్గ్, మడికెరి – కర్ణాటక, మౌంట్ అబు – రాజస్థాన్, షిల్లాంగ్ – మేఘాలయ, అరకు, హార్స్‌లీ హిల్స్ – ఏపీ,


Next Story

Most Viewed