అలా చేస్తే దోమలు గుడ్లు పెడుతాయి !

by  |
అలా చేస్తే దోమలు గుడ్లు పెడుతాయి !
X

దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు హైదరాబాద్‌లో దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌త్యేక కార్య‌ాచ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు జీహెచ్‌ఎంసీ ఎంట‌మాల‌జీ, శానిటేష‌న్ విభాగాల అద‌న‌పు క‌మిష‌న‌ర్ రాహుల్ రాజ్ తెలిపారు. జాతీయ డెంగ్యూ నిర్మూల‌న దినోత్సవం సందర్భంగా శనివారం న‌గ‌రవ్యాప్తంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు వివరించారు. మెహిదీప‌ట్నంలోని బోజ‌గుట్ట‌లో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంతరం జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఎంట‌మాల‌జీ ప్ర‌ద‌ర్శ‌న‌ను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఒక దోమ త‌న జీవిత కాలంలో పెట్టే లార్వాల(గుడ్లు) ద్వారా ల‌క్ష‌లాది దోమ‌ల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌లుగుతుంద‌ని, ఈ లార్వా దోమ‌గా మార‌డానికి 8-10 రోజులు సమయం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. గతేడాది అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని దోమ‌ల వ్యాప్తిని పూర్తిగా అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామన్నారు. రోడ్లు, బ‌హిరంగ ప్ర‌దేశాలు, డ్రైనేజీ, మురికివాడ‌లు, చెరువుల్లో దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఎంట‌మాల‌జీ విభాగం కృషిచేస్తుందన్నారు. ఇంటి ప‌రిస‌రాలు, కార్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌ల‌లో నీటిని నిల్వ‌చేసే పాత్ర‌లు, వాట‌ర్ ట్యాంక్‌లు, పూల కుండీల‌ను వారానికోసారైన క్లీన్ చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్లాస్టిక్ డ‌బ్బాలు, కుండ‌లు, సీసాలు, టైర్లు, కొబ్బ‌రి చిప్ప‌ల్లో వ‌ర్ష‌పునీరు నిలిచి ఉంటే దోమ‌లు గుడ్లు పెడ‌తాయ‌ని తెలిపారు. దోమ‌ల నివార‌ణ‌కు ప్ర‌తి ఆదివారం 10గంట‌ల‌కు 10 నిమిషాలు కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story

Most Viewed