‘ఎమ్మార్పీఎస్ నాయకుడి ఆరోపణలు అసత్యం’

by  |
‘ఎమ్మార్పీఎస్ నాయకుడి ఆరోపణలు అసత్యం’
X

దిశ, నల్లగొండ: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు తీగల రత్నంపై నల్లగొండ టూ టౌన్ పోలీసులు దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నల్లగొండ ఎస్పీ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ విషయంపై ఆయన ప్రాథమిక విచారణ జరిపారు. లాక్‌డౌన్‌కు ముందు తీగల రత్నం మేనకోడలు నివాసం ఉంటున్న ఇంటి విషయంలో ఆయనకు, మేనకోడలు బంధువులకు మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రత్నం కొద్ది రోజుల క్రితం తన మేనకోడలుతో పాటు ఆమె వెంట ఇంట్లో ఉన్న మహిళలను ఇంట్లో ఉంచి బయట తాళం వేసి వారిని భయబ్రాంతులకు గురి చేశాడని తెలిపారు. ఈ సమయంలో ఆయన మేనకోడలు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిందని, ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ యాదగిరి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఉన్న రత్నంతో పాటు మునుగోడుకు చెందిన ఆయన మిత్రుడు పోలీసులను దుర్బాషలాడడంతో ఎదురు తిరిగి దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. రత్నం నిర్బంధించిన మహిళలను పోలీసులు రక్షించే క్రమంలో ఆయనపై రెండు దెబ్బలు వేశారని ఎస్పీ వివరించారు.
కానీ సామాజిక మాధ్యమాల్లో లాక్‌డౌన్ సమయంలో తీగల రత్నంపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎస్పీ తెలిపారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రాథమికంగా విచారణ చేయడం జరిగిందని ఎస్పీ రంగనాథ్ వివరించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేస్తున్నామని విచారణ అనంతరం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిని విచారణా అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

Tags: nalgonda SP, preliminary inquiry, police, attack, Mrps leader, lockdown


Next Story

Most Viewed