మొలకెత్తని సోయా

by  |
మొలకెత్తని సోయా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానాకాలం పంటల సాగుకు ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఇందూరు జిల్లా రైతులు ఆరుతడి పంటలనే సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతులు సహకార సంఘం ఆధ్వర్యంలో సోయాబిన్ విత్తనాలు సబ్సిడీ కింద కొనుగోలు చేసి విత్తారు. కానీ, అవి మొలకలు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. వానాకాలం ప్రారంభం నుంచి 10 రోజులుగా జిల్లాలో సోయా విత్తనాలు వేసిన అన్నదాత మొలకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వారికి నిరాశే ఎదురవుతున్నది. సబ్సిడీ విత్తనాల్లో 50 శాతం మొలకలు రావని గత అనుభవాలు చెబుతున్నాయని పలువురు రైతులు అంటున్నారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో తాము దుక్కికి, కూలీలకు, విత్తనాలకు చేసిన ఖర్చు నీటిపాలవుతున్నదని రైతులు వాపోతున్నారు. తమను సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.

విత్తి వారం గడుస్తున్నా..

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామ రైతులు చౌట్‌పల్లి సహాకార సంఘం నుంచి సోయాబిన్ సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేశారు. ఎకరాకు 30 కిలోల బస్తా విత్తారు. విత్తనాలు వేసి వారం గడుస్తున్నా అవి మొలకెత్తకపోవడంతో రైతులు చెందుతున్నారు. వ్యవసాయ అధికారులను సంప్రదించగా ఇంకో రెండ్రోజుల్లో మొలక వస్తుందని చెప్పారు. అయినా రాలేదని రైతు ఎల్లల్లా పెద్దరాజరెడ్డి చెబుతున్నాడు. తనకున్న 4 ఎకరాలలో సోయా విత్తనాలు చల్లాననీ, వారం రోజులు గడుస్తున్నా ఒక్క మొలక బయటకు రావడం లేదని అంటున్నాడు. ఈ పరిస్థితి ఒక్క కమ్మర్ పల్లి మండలమే కాకుండా మోర్తాడ్, వెల్పూర్, భీంగల్, జక్రాన్ పల్లి, బాల్కోండతో పాటు ఇతర మండలాల్లోనూ ఉన్నది.

రైతుల ఆందోళన

గురువారం వెల్సూర్ మండలం మోతే గ్రామ రైతులు ఆందోళన చేశారు. దాంతో రాష్ర్ట మార్క్‌ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి సొసైటీకి వెళ్లి సముదాయించారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన సీజన్‌లో 70 వేల ఎకరాలలో సోయా పంటను పండించారు రైతులు. ప్రభుత్వం ఈ సీజన్‌లో దానిని 1.10 లక్షల ఎకరాలకు పెంచింది. జిల్లాకు 30 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 10 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. నిజామాబాద్ జిల్లాలో 89 సొసైటీల ద్వారా ప్రభుత్వం సప్లయ్ చేసిన వి కేర్ అగ్రిటెక్ జేఎస్ 335, అక్షయ్ అగ్రిటెక్ జేఎస్ 335 అనే విత్తన కంపెనీల విత్తనాలు రైతులకు ఇచ్చారు. 30 కిలోల బస్తాకు సబ్సిడీ కింద రూ.1,184లకు పంపిణి చేశారు. అయితే, విత్తిన సోయా మొలకలు రాకపోవడంపై రైతుల కష్టం నేలపాలైంది.

నకిలీ విత్తనాల సరఫరాదారులపై పీడీ యాక్ట్ పెట్టండి

రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రిత వ్యవసాయం చేయాలన్నారు. అందుకనుగుణంగా పంటల మార్పిడి చేసుకొని ఇతర పంటలకు వెళ్లే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో రైతులు సోయాబిన్ వేశారు. ఆ సోయాబిన్ కూడా మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేసినవే. అవి విత్తినా మొలకెత్తకపోవడంతో రైతులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో కమ్మర్‌పల్లి, వేల్పూర్ జక్రాన్‌పల్లి మండలలతో పాటు దాదాపు జిల్లా అంతా మార్క్‌ఫెడ్ విత్తనాలే విత్తారు. అంతటా మొలకలు రాలేదు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు వర్షం పడకముందే విత్తనం వేశారనీ, అందుకే సోయా విత్తనాలు మొలవలేదు అని అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే ఇతర కంపెనీల విత్తనాలు ఎలా మొలిశాయో చెప్పాలి. ఇలాంటి నకిలీ విత్తనాలు రైతుకు సరఫరా చేసినందుకు ఎవరి మీద పీడీ యాక్ట్ పెడుతారో సీఎం చెప్పాలి. ఇలాంటి విత్తనాలు రైతులకు ఇవ్వడంలో ఎవరెవరు ఉన్నారో విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. – అన్వేష్ రెడ్డి, చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్


Next Story

Most Viewed