యూనివర్సిటీలో కాసులు కురిపిస్తున్న హ్యూమన్ వేస్ట్!

by  |
యూనివర్సిటీలో కాసులు కురిపిస్తున్న హ్యూమన్ వేస్ట్!
X

దిశ, ఫీచర్స్ : మన శరీరం నుంచి వచ్చే మలమూత్రాలు శక్తి వనరులుగా మారి దక్షిణకొరియాలో కరెన్సీ కురిపిస్తోంది. టాయిలెట్ యూజ్ చేస్తే డబ్బు చెల్లించడం చూసి ఉంటారు కానీ, అందుకు భిన్నంగా దక్షిణ కొరియాలోని విశ్వవిద్యాలయంలో టాయిలెట్ ఉపయోగించడం వల్ల కాఫీకి లేదా అరటిపండ్లకు డబ్బు చెల్లించవచ్చు. అదెలా అంటారా? సూక్ష్మజీవులు వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తాయని తెలిసిన విషయమే. ఇదే సూత్రం ఆధారంగా హ్యుమన్ వేస్ట్ ఓ భవనానికి ‘పవర్’ సప్లయ్ అందిస్తోంది.

ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (యునిస్ట్)లో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ చో జే-వీన్ ఎకో ఫ్రెండ్లీ ‘బీవీ’ టాయిలెట్ రూపొందించి దీన్ని ల్యాబోరేటరీకి కనెక్ట్ చేశాడు. దాంతో విసర్జిత పదార్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. బీవీ టాయిలెట్ – వాక్యూమ్ పంప్‌ను ఉపయోగించి భూగర్భ ట్యాంకులోకి మలం పంపడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది. అక్కడ, సూక్ష్మజీవులు వ్యర్థాలను మీథేన్‌‌గా విచ్ఛిన్నం చేస్తాయి. ఇది భవనంలోని గ్యాస్ స్టవ్, వేడి-నీటి బాయిలర్, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయెల్ సెల్‌కు శక్తి వనరుగా ఉపయోగపడుతుంది.

‘ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం వల్లే ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్ మీ ముందుకు వచ్చింది. సగటు వ్యక్తి రోజుకు 500 గ్రాముల మలవిసర్జన చేస్తాడు. దీనిని 50 లీటర్ల మీథేన్ వాయువుగా మార్చవచ్చు. ఈ వాయువు 0.5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు లేదా సుమారు 1.2 కిలోమీటర్ల వరకు కారును నడపడానికి ఉపయోగించబడుతుంది. ఇక దీని ఉపయోగం ప్రజలకు ముఖ్యంగా నేటితరం విద్యార్థులకు తెలియాలి. అందువల్లే జీగూల్(Ggool) అనే వర్చువల్ కరెన్సీ రూపొందించాం. పర్యావరణ అనుకూల మరుగుదొడ్డిని ఉపయోగించే ప్రతి విద్యార్థి రోజుకు 10 Ggool సంపాదిస్తాడు. విద్యార్థులు తాజాగా తయారుచేసిన కాఫీ, ఇన్‌స్టంట్ కప్ నూడుల్స్, పండ్లు, పుస్తకాల వరకు క్యాంపస్‌లో ఏ వస్తువులైనా కొనడానికి ఈ కరెన్సీని ఉపయోగించవచ్చు. స్టూడెంట్స్ తమకు కావలసిన ఉత్పత్తులను తీసుకొని, Ggool తో చెల్లించడానికి QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. – చో జే-వీన్, పర్యావరణ ఇంజనీర్

Next Story

Most Viewed